- పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ వైద్య సేవలు
- రెండేళ్లలోనే 1750 మెడికల్ సీట్లు లభ్యం
- ఫీజులు, రిజర్వేషన్లకు ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయి
జగన్ ప్రభుత్వ విధానంకన్నా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానంవల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 220 మెడికల్ సీట్లు వస్తాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 110 సీట్లు పేద, మధ్యతరగతి విద్యార్థులకు అదనంగా పెరుగుతాయి. అలాగే రెండేళ్లలోనే పది మెడికల్ కాలేజీల నిర్మాణాలు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తై.. 1750 మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు త్వరగా పొందుతారు. జగన్ చేసినట్టు చేస్తే ఈ 1750 సీట్లు పొందాలంటే 15 ఏళ్లు ఎదురుచూడాలి. పీపీపీ విధానంలో నిర్మించే ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యసేవలు పేదలు పొందుతారు. రిజర్వేషన్లు, ఫీజులకు ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయి. ఎలుకలను పట్టగలగడం ముఖ్యంగాని, అది నల్లపిల్లా? తెల్లపిల్లా? అనేది ముఖ్యం కాదు.
1995 `2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ కాలేజీ, రెవిన్యూ డివిజన్‌కొక ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు. అందువల్లనే నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో 18, ప్రైవేట్‌రంగంలో 18, మొత్తం 36 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో నడుస్తున్నవి. దీనివల్ల పేద విద్యార్థులు ఎక్కువమంది డాక్టర్లు కాగలిగారు. రాష్ట్రంలో వైద్యుల కొరత ఎక్కువకాకుండా ఉండేందుకు దోహదపడిరది. కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడితే వైద్యుల కొరత తీవ్రంగా ఉండేది. అలాగే నేడు ప్రతి నలుగురు ఎన్‌ఆర్‌ఐలలో ఒకరు తెలుగువారు ఉన్నారంటే అందుకు కారణం ఆనాడు చంద్రబాబు అమలు చేసిన హైబ్రిడ్ విధానమే కారణం. విదేశాల్లో ఉద్యోగాలు పొందిన మన డాక్టర్లు, ఇంజనీర్లు వేలకోట్లు తమ తల్లిదండ్రులకు, తోబుట్టువులకు పంపిస్తున్నారు. కొందరు విదేశాల్లో డబ్బు సంపాదించి మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి వేలాది ఉద్యోగాలు కల్పించారు. ఇదంతా చంద్రబాబు హైబ్రిడ్ విధానాలవల్లే సాధ్యమైంది. చైనా, వియత్నాం హైబ్రిడ్ విధానాలు అమలుచేసి ఆ దేశాలు సంపన్న దేశాలుగా అభివృద్ధి అయ్యాయి. నార్త్ కొరియా, క్యూబా పిడివాదంతో హైబ్రిడ్ విధానాలు అవలంబించనందున వెనకబడిపోయాయి.
మెడికల్ కాలేజీలపై జగన్ మొసలి కన్నీరు
జగన్ విధానం రెంటికీ చెడ్డ రేవడిగా ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15శాతం కేంద్ర కోటా పోగా మిగిలిన అన్ని మెడికల్ సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉండేవి. రూ.10వేల ఫీజు చెల్లిస్తే సరిపోయేది. ఈ విధానాన్ని జగన్ మారుస్తూ జీఓ 107, 108, 133 విడుదల చేసి 50శాతం మెడికల్ సీట్లు ప్రైవేటుకు కేటాయించారు. ఫీజులు కూడా భారీగా పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరికి రూ.12 లక్షలకు పెంచారు. ఎన్నారై కేటగిరి ఫీజు రూ.20 లక్షలకు పెంచారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు ప్రైవేటుకు కేటాయించింది జగన్ ప్రభుత్వమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదు. మెడికల్ కాలేజీల సీట్లు ప్రైవేటీకరించిన జగన్.. నేడు కార్చేది మొసలి కన్నీరు మాత్రమే. జగన్ విధానంలో 50శాతం సీట్లు ప్రైవేటుకు పోవడమేకాక మరో 15 శాతం సీట్లు కేంద్ర కోటాలో ఇతర రాష్ట్రాలకు పోతాయి. ఈ విధంగా రెంటికి చెడ్డ రేవడి చేశారు.
పీపీపీ విధానంలో కేంద్ర కోటాలో 15శాతం ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పనిలేదు. 10 మెడికల్ కాలేజీల్లో అదనంగా మన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో అదనంగా 110 సీట్లతోపాటు ప్రైవేటు కోటాలో మరో 110 సీట్లు మొత్తం 220 సీట్లు పెరుగుతాయి. మెడికల్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు పెరగడం ముఖ్యంగాని ఎవరు నిర్వహణ చేస్తారనేది ముఖ్యం కాదు. పీపీపీ విధానంలో కూడా 50 శాతం మెడికల్ సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయి. జగన్ ప్రైవేటుకు కేటాయించిన సీట్లే పీపీపీ విధానంలో ప్రమోటర్ భర్తీ చేస్తారు. పీపీపీ కాలేజీల యాజమాన్య హక్కులున్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. రిజర్వేషన్లకు ప్రభుత్వ నిబంధనలే అమలు జరుగుతాయి. 33ఏళ్ల తర్వాత వాటి నిర్వహణ కూడా ప్రభుత్వ స్వాధీనమవుతుంది.
కరెంట్ కోతలు నివారించుటకు గతంలో పీపీపీ విధానంలో జేగురుపాడు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడమైంది. నేడు 33 ఏళ్లు పూర్తి అయినందున అది తిరిగి ప్రభుత్వ స్వాధీనమైంది. జగన్ పాలనలో గంగవరం పోర్టును ప్రైవేట్‌వారికి అమ్మి వేశారు. విశాఖ స్టీలు ప్లాంటు భూములు అమ్మి వేయమని కేంద్రానికి జగన్ సలహా ఇచ్చారు. మెడికల్ సీట్లు ప్రైవేటీకరించింది కూడా జగనే. ఇప్పుడు జగన్ కారుస్తున్నది మొసలి కన్నీరు మాత్రమే.
మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని జగన్
మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.8,480కోట్లు ఖర్చు చేస్తేనే అవి పూర్తై ఉండేవి. కానీ ఐదేళ్ల పాలనలో జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.1550 కోట్లు మాత్రమే. ఇందులో ఒక రూపాయి కూడా రాష్ట్ర నిధులు జగన్ ఖర్చు చేయలేదు. ఖర్చు చేసిన రూ.1550 కోట్లు పూర్తిగా కేంద్ర నిధులే. పీజీ మెడికల్ సీట్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.700 కోట్లు కూడా దారి మళ్లించి స్పెషలిస్టు వైద్య విద్యకు నష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో 18 శాతం మాత్రమే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ వాస్తవానికి విరుద్ధంగా 17 కాలేజీలు నిర్మించినట్టుగా అబద్ధాలు చెబుతున్నారు. క్లాసులు ప్రారంభమైన ఐదు కాలేజీల్లో కూడా అరకొర సౌకర్యాలే కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై జగన్‌కు చిత్తశుద్ది ఉంటే ఆనాడు రాష్ట్ర నిధులు ఎందుకు ఖర్చు చేయలేదు? త్వరగా ఎందుకు నిర్మాణాలు పూర్తిచేయలేదు?
అభివృద్ధి.. సంక్షేమ పథకాలకు కోతపెట్టి మెడికల్ కాలేజీలు నిర్మించాలా?
జగన్ విధ్వంస పాలనవల్ల నేడు కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఉన్న కొద్దిపాటి నిధులు రెండేళ్లలో మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే అభివృద్ధి.. సంక్షేమ పథకాలకు కోతపడవా? ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కోతలు వేయాలా? రోడ్లు, పేదల గృహ నిర్మాణాలు నిలిపివేయాలా? ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎన్టీఆర్ వైద్య సేవ నిలిపివేయాలా? ఇవన్నీ దెబ్బతీసి పేదల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలనేది జగన్ ముఠా కుట్రగా ఉన్నది. అందుకే మెడికల్ కాలేజీలపై అబద్ధపు ప్రచారాలతో దండయాత్రలు చేస్తున్నారు. దీర్ఘకాలం రచ్చ చేయాలని తన బినామీల ద్వారా రచ్చ చేస్తున్నారు. తాను ఐదేళ్లలో చేయలేనిది కూటమి ప్రభుత్వాన్ని రెండేళ్లలో చేయమని ఎలా యాగీ చేస్తారు? మెడికల్ కాలేజీలపై జగన్ ముఠా చేస్తున్నది స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమేగాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. హైకోర్టు బుద్ధిచెప్పినా జగన్ ముఠా బుద్ధి మార్చుకోలేదు. కర్నాటకలో 12 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లాంటి రాష్ట్రాలలో కూడా ఈ విధానం అమలు చేస్తున్నారు.
జగన్ పాలనలో వైద్య ప్రమాణాలు 10వ స్థానానికి దిగజారింది నిజంకాదా?
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వైద్య, ఆరోగ్య ప్రమాణాల్లో చంద్రబాబు పాలన (2014-19)లో 4వ స్థానంలో ఉన్న ఏపీని, జగన్ పాలన (2019-2024)లో 10వ స్థానానికి దిగ జార్చింది నిజమని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆరోగ్య సేవలు గొప్పగా అందించాననే జగన్ మాటలు శుద్ధ అబద్ధాలు మాత్రమే. విషపూరిత మద్యం ప్రభుత్వ షాపుల ద్వారా సరఫరా చేసి 35 లక్షలమంది పేదల ఆరోగ్యాలు పాడుచేశారు. వారి లివర్, కిడ్నీలు, మెదడు దెబ్బతిని సుమారు 30 వేలమంది మరణించారు. జగన్ పాలనలో సరఫరా చేసిన మద్యంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని చెన్నై, బెంగుళూరు, చివరకు అమెరికా ల్యాబ్స్ కూడా స్పష్టం చేశాయి. వీటిపై జగన్ ప్రభుత్వం తగు తనిఖీలు చేయలేదు ఎందుకు? నేడు కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యంపై ఒకటి, రెండుచోట్ల ఆరోపణలు వస్తే వెంటనే బాధ్యులపై కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేయడమైంది. నాణ్యత పరీక్షల కోసం ఎక్సైజ్ సురక్ష యాప్‌ను వినియోగదారులకు అందించడమైంది. నాణ్యతా ప్రమాణాల కోసం 13 రకాల పరీక్షలు చేస్తున్నారు.
ఇలా జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కల్తీ మద్యానికి జంగారెడ్డిగూడెంలో 27మంది పేదల ప్రాణాలు పోయాయి. బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా సమర్థించారు. విజయవాడలో కల్తీ మద్యంవల్ల ఆర్గురి ప్రాణాలు పోయినా.. బాధ్యుడైన వైకాపా నేత మల్లాది విష్ణుపై చర్యలు తీసుకోలేదు. కాకాణి గోవర్థన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డిపై కల్తీ మద్యం కేసులున్నా జగన్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇలా ఐదేళ్ల పాలనలో విషపూరిత మద్యంపోసి లక్షలాది పేదల ఆరోగ్యాలు గుల్లచేసిన జగన్‌కు.. పేదల పేరుచెప్పే కనీస అర్హత ఉందా? పేదల ద్రోహి జగన్. పేదల పెన్నిధి చంద్రన్న అనేది కొండంత సత్యం కాదా? పీపీపీ విధానంలోనే మెడికల్ సీట్లు పెరుగుతాయి. త్వరగా కాలేజీ నిర్మాణాలు పూర్తవుతాయి. ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. రెండేళ్లలోనే 1750 మెడికల్ సీట్లు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలతో అలజడి రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. స్వర్ణాంధ్రను సాధించుకుని తెలుగువారు దేశంలో అగ్రస్థానంలో నిలబడాలి.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్













