- ముంబయి నుంచి రాజమండ్రి, తిరుపతికి విమానాలు నడిపేందుకు ముందుకు వచ్చిన ఇండిగో
- రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ
- మరిన్ని సర్వీసులు తీసుకు వచ్చేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి కృషి
న్యూఢిల్లీ (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గత 6 నెలల్లోనే గణనీయంగా పెరిగిన విమాన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరికొన్ని కొత్త సర్వీసులు రాబోతున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢల్లీి, ఆర్థిక రాజధాని ముంబయికి కొత్త సర్వీసులు ప్రారంభం కాగా.. తాజాగా రాష్ట్రానికి మరో 2 కొత్త సర్వీసులు మంజూరయ్యాయి. రాజమండ్రి – ముంబయి – రాజమండ్రి(6ఈ 582/3), తిరుపతి – ముంబయి – తిరుపతి(6ఈ 532/3) మధ్య డిసెంబర్ 2 నుంచి కొత్తగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడిరచింది. ఇందులో భాగంగా ఒక సర్వీసు ప్రతిరోజు సాయంత్రం 4.50 గంటలకు ముంబయిలో బయలుదేరి, 6.45 గంటలకు రాజమండ్రి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.15 గంటలకు ప్రారంభమై, 9.05 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. మరో విమానం ఉదయం 5.30 గంటలకు ముంబయిలో బయలుదేరి 7.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి 7.45 గంటలకు బయలుదేరి 9.25 గంటలకు ముంబయి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఈ 2 నగరాల నుంచి ముంబయి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగానే వెళ్లాల్సి వచ్చేది. తాజా సర్వీసులతో ప్రయాణ సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.
గోదావరి జిల్లాలు, భక్తులకు ప్రయోజనం..
దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ సీఎం నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా రవాణాలో విమానయాన రంగం ప్రాధాన్యత రోజురోజుకూ పెరగుతుండడం ఆనందకరమని తెలిపారు. రాజమండ్రి నుంచి ముంబయి మీదుగా విదేశాలకు వెళ్లే ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు, తిరుమల బాలాజీ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ కొత్త సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వంలో విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సర్వీసులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను మరింతగా అనుసంధానం చేసేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.