- తరచూ హాస్టళ్లను సదర్శించండి
- బీసీ సంక్షేమశాఖాధికారులకు మంత్రి సవిత ఆదేశం
తిరుపతి (చైతన్యరథం): కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో బీసీ హాస్టళ్లలో వంద శాతం మేర ఫలితాలు రావాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఇందుకోసం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నెల రోజుల్లో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా, పరీక్షలకు సిద్ధమయ్యేలా సన్నద్ధం చేయాలన్నారు. పాఠాలపై అవగాహన కలిగేలా బోధించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టుకునేలా కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా పదో తరగతిలో ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు.
నిధుల సమీకరణలో అలసత్వం వద్దు
బీసీ హాస్టళ్ల అభివృద్ధికి ప్రభుత్వం అందజేసే నిధులతో పాటు సీఎస్‌ఆర్ ఫండ్స్, ఎంపీ ల్యాడ్స్ నిధులు సేకరించాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి సవిత ఆదేశించారు. సీఎస్‌ఆర్ ఫండ్స్ కోసం జిల్లా పరిధిలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలను కలవాలన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలన్నారు. పార్లమెంట్ సభ్యుల నుంచి ఎంపీ ల్యాడ్స్‌నిధులు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎంపీలిచ్చే నిధులను వారి పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీ హాస్టళ్ల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు తెలియజేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అందరూ ఎంపీలకు ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం లేఖలు రాసినట్లు మంత్రి తెలిపారు. కొందరు ఎంపీలు తమ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీ హాస్టళ్ల అభివృద్ధి నిధుల కేటాయింపునకు అంగీకారం తెలిపారన్నారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు వినియోగించి హాస్టళ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. దాతలను సంప్రదించి, విరాళాలు సేకరించి హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని మంత్రి సవిత సూచించారు.
ఎప్పటికప్పుడు హాస్టళ్లను సందర్శించండి
జిల్లా స్థాయి బీసీ సంక్షేమ శాఖాధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలో ఉన్న హాస్టళ్లను సందర్శించాలని మంత్రి సవిత ఆదేశించారు. తప్పనిసరిగా హాస్టల్ విజిట్స్ చేయాలని, దీనికి సంబంధించిన నివేదికలు తనకు పంపించాలని స్పష్టంచేశారు. జిల్లాస్థాయి అధికారులు తరచూ హాస్టళ్లు సందర్శించడం వల్ల వార్డెన్లు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉంటారన్నారు. గత ప్రభుత్వం పెట్టిన డైట్ బకాయిలు చెల్లించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మన చేతిలో ఉందని, అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉందని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ జిల్లా సంక్షేమ శాఖాధికారి చంద్రశేఖర్, ఏబీసీడబ్ల్యూఈవోలు బి.జ్యోత్స్న, ఐ.కృష్ణయ్య, కె.లక్ష్మీనారాయణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.