అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం రాత్రి హుటాహుటిని తిరుపతికి బయలుదేరారు. తిరుపతి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆనం.. స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించేందుకు తిరుపతికి బయలుదేరారు. భద్రతా చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు.. అర్థరాత్రే తిరుపతిలో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. బాధితులకు సత్వర సహాయక చర్యలు అందించేందుకు మంత్రి ఆనంను సీఎం ఆదేశించారు. తిరుపతికి వెళ్తూనే.. జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ పోలీసు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. అలాగే సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఆనం సహా హోంమంత్రి అనిత, రెవిన్యూ మంత్రి సత్యప్రసాద్ తిరుపతికి బయలుదేరారు. నేటినుంచి జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వయంగా మంత్రుల బృందం పరిస్థితిని పర్యవేక్షించనుంది. మరోపక్క రుయా ఆస్పత్రిని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శించి, వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇస్తూ.. దుర్గటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, విఫలమైన అధికారులపై చర్యలు ఉంటాయని నాయుడు వెల్లడిరచారు.