- రానున్న రోజులన్నీ ప్రకృతి వ్యవసాయానిదే
- రైతులకు ఇప్పటినుంచే అవగాహన కల్పించండి
- టెక్నాలజీతో సాగు ఖర్చులకు చెక్ పెట్టాలి
- అగ్రి డీప్ టెక్‌లో దేశానికి ఏపీ దిక్సూచి
- డ్రోన్ కల్చర్‌తో అగ్రికల్చర్లో అద్భుత ఫలితాలు
- వ్యవసాయ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
- రబీనుంచి రైతులకు పాత పద్ధతిలోనే భీమా
- రాష్ట్రంలో సాగు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష
మరావతి (చైతన్య రథం): రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలాగైతే గేంఛేంజర్ అయ్యిందో… రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం అలాంటి గేంఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రకృతి సేద్యంలో ఏపీ పయనీర్‌గా నిలవాలని…. దీనికి టెక్నాలజీని జోడిరచడం ద్వారా అనూహ్య, అద్భుత ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. ప్రకృతి సేద్యం- అగ్రి డీప్‌టెక్ విధానంతో దేశానికి ఏపీ వ్యవసాయ రంగంలో దిక్సూచి అయ్యేలా చేయాలని… అందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఖర్చులు గణనీయంగా పెరిగి రైతులకు సాగుభారంగా మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ ద్వారా ఖర్చులు నియంత్రించాలన్నారు. పంటల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పంటల సాగుకు 40 వేల డ్రోన్లు అవసరమని అధికారులు వివరించారు. సాగులో డ్రోన్లకు కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని… తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తుందని…ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు డ్రోన్లపై శిక్షణనిచ్చి డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దితే.. ఇదొక కుటీర పరిశ్రమ అవుతుందన్నారు. గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పకృతి సేద్యాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపిన అధికారులు…. ప్రకృతి సేద్యంతో సాగయ్యే పంటలు సాధారణ పంటలకంటే ఎక్కువగా వరదలు, విపత్తులను తట్టుకుంటున్నట్టు పరిశీలనలో తేలిందని వివరించారు. రెండు నెలల క్రితం వచ్చిన భారీ వర్షాలు, వరదల సమయంలో చేసిన స్టడీలో ఈ విషయాలు వెలుగు చూశాయన్నారు. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ప్రకృతి సాగు, సాధారణ సాగు చేసిన ఒకే రకమైన పంటలు…. వరదలకు దెబ్బతిన్న శాతాన్ని పరిశీలించి తాము ఈ అంశంపై నివేదిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. వరదల కారణంగా కెమికల్ ఫార్మింగ్ జరిగే పంటలు 100 శాతం దెబ్బతింటే…. ఆ పక్కనే ఉన్న ప్రకృతి వ్యవసాయం కింద సాగయ్యే పంట 10 శాతం మాత్రమే దెబ్బతిన్నట్టు గుర్తించామన్నారు. ఇది కీలకమైన అంశమని… రైతులను ప్రకృతి సాగు వైపు తీసుకువెళ్లడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అన్నారు.
ఇలాంటి సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చి వారిని పకృతి సేద్యం లాభాల గురించి తెలుసుకునేలా చేయాలని సూచించారు. అంతకుముందు అధికారులు పంట ఉత్పత్తుల పెంపు, సాగు విస్తీర్ణం పెంపు, భూసార పరీక్షలు వంటి అంశాల్లో తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భూసార పరీక్షలు చేసి రైతులకు అవసరమైన పోషకాలు అందించే పరిస్థితి రావాలని సీఎం అన్నారు. జూలై నెలలో జరిగిన పంటనష్టానికి సంబంధించి రూ.37 కోట్లు రైతులకు పరిహారం కింద చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పగా… నిధుల విడుదలకు సీపం అంగీకరించారు. సెప్టెంబర్‌లో వచ్చిన వరదలతో రైతుల పంటనష్టానికి గాను రూ.319 కోట్లు నెలరోజుల వ్యవధిలోనే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల ప్రకారం రబీనుంచి పాత పద్దతిలో క్రాప్ ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.