ఢిల్లీ (చైతన్య రథం): ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘సూపర్ జిఎస్టీ -సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభ ముగించుకుని ఢిల్లీ వెళ్లిన వెంటనే మోదీ.. పర్యటనతో తనకు కలిగిన అనుభూతిపై ఎక్స్ వేదిగా ట్వీట్ పెట్టారు. “పరిశ్రమలను బలోపేతం చేసి.. పౌరులను శక్తిమంతంచేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగానూ అనిపించింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నా. ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి.. విజ్ఞానశాస్త్రం.. ఆవిష్కరణల కేంద్రం కూడా. స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మల్టీమోడల్ మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాలనుంచి నగరాలు, నగరాల నుంచి పోర్టుల వరకూ కనెక్టివిటీపై దృష్టి పెట్టాం. భారత్, ఏపీ వేగం, సామర్ధ్యాన్ని ప్రపంచం చూస్తోంది” అంటూ ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.