అమరావతి (చైతన్యరథం): రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీమార్క్‌ఫెడ్), న్యూఢల్లీిికి చెందిన నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్) మద్య వ్యూహాత్మకమైన అవగాహన ఒప్పందం జరిగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఎక్స్-ఆఫీషియో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, వ్యవసాయం, వ్యవసాయం) బుడితి రాజశేఖర్, ఏపీమార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు సమక్షంలో మార్క్‌ఫెడ్ ఎండీ డా. మనజీర్ జిలానీ సమూన్, ఎన్‌సీఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉనుపమ్ కౌసిక్ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని సహకార సంఘాలు, రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఏపీమార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. జాతీయ స్థాయి ఎగుమతి ఏజెన్సీ అయిన ఎన్‌సీఈఎల్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, అంతర్జాతీయ మార్కెటింగ్‌ను సులభతరం చేస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ప్రపంచ మార్కెట్ అవకాశాలను సృష్టించడానికి, రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం ఎంతగానో దోహద పడనుంది.