- వీఆర్ హైస్కూల్ పునర్నిర్మాణ పనుల పరిశీలన
నెల్లూరు (చైతన్యరథం): టీడీపీ నేతలపై అక్రమకేసులు బనాయించటంపై పెట్టిన శ్రద్ధలో పదో వంతు కూడా విద్యాలయాలపై వైసీపీ ప్రభుత్వం పెట్టలేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విమర్శించారు. ఐదేళ్ల పాటు సాగిన జగన్ సర్కార్ అస్తవ్యస్థ పాలనతో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. నెల్లూరులో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మూతపడ్డ వీఆర్ హైస్కూల్‌ని ఆధునీకరించి నిరుపేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణ వీఆర్‌సీ పాఠశాల పునర్నిర్మాణ పనులను కమిషనర్ నందన్‌తో కలిసి పరిశీలించారు. అన్ని తరగతి గదులను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రౌండ్‌లో ఉన్నటువంటి శిధిలమైన భవనాలను తొలగించి విద్యార్థుల ఆటపాటలకు అనుకూలంగా మైదానాన్ని సిద్ధం చేయాలని దేశించామన్నారు. నెల్లూరు నగర నడిబొడ్డులో మూడు షిఫ్టుల్లో 8 వేలకు పైగా విద్యార్థులు చదువుకున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థను గత పాలకులు నిర్వీర్యం చేశారన్నారు.
గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నగరంలోని పేదలు, నిరుపేదలకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తామన్నారు. ఎన్‌సీసీ కంపెనీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభించే నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామన్నారు. మొదటి సంవత్సరంలో వేయి మంది పేదలకు అడ్మిషన్స్ కల్పిస్తామని, ఉచిత బస్సు, భోజన వసతితో పాటు సాయంకాలం ఆటపాటల అనంతరం స్నాక్స్ అందించి వారి ఇళ్ల వద్ద దించుతామన్నారు. తరువాతి విద్యా సంవత్సరం పేదల అడ్మిషన్లు రెండు వేలకు పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజేతా రెడ్డి ,నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, స్థానిక కార్పొరేటర్లు, టీడీపీ నేతలు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు .