విజయవాడ (చైతన్యరథం): వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని వారం రోజులపాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు విచారణకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ విచారణ ద్వారా రాజ్ కసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు చూస్తున్నారు.
కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసి ఒకసారి విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ సేకరించిన పలు ఆధారాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో చెప్పిన సమాచారంతో సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే తొలుత అధికారులకు కసిరెడ్డి సహకరించలేదు. రెండో విడత విచారణలో కొన్ని ఆధారాలతో సిట్ అధికారులు ప్రశ్నించగా.. కొన్నింటికి సమాధానాలు చెప్పారు. సిట్ విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కసిరెడ్డిన కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు ఈకేసులో ముందస్తు బెయిల్ కోసం కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
కసిరెడ్డి పీఏ అరెస్ట్
ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి పీఎ పైలా దిలీప్‌ను సిట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న దిలీప్‌ను సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సిట్ బృందం దిలీప్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే పోలీసుల ముందు హాజరుకాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు దిలీప్ ప్రయత్నించాడు. డిజిటల్, ఫోన్ లోకేషన్ ద్వారా దిలీప్ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో దిలీప్‌ను చైన్నై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి. కమీషన్‌లు ఇచ్చే డిస్టిలరీల యజమానులతో దిలీప్ కాంటాక్టులో ఉండేవాడని డిస్టిలరీల యజమానులు సిట్ బృందానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న మనుషులందరూ కూడా పీఏ చెబితేనే అక్కడి వెళ్లి కమీషన్లు వసూలు చేసే వారని విచారణలో తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతీ వారం లెక్కలు తేల్చి.. ప్రతీ నెల 50 నుంచి 60 కోట్లను ఆయా వ్యక్తులకు ఇచ్చే వారని సమాచారం. రాజ్ కసిరెడ్డి, డిస్ట్లలరీల యజమానుల మధ్య అనుసంధాన కర్తగా ఉన్న పైలా దిలీప్‌ను విచారిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.