అమరావతి (చైతన్య రథం): లక్ష ఇళ్లను ఒకేసారి ప్రారంభిద్దామని అంటూ.. అర్బన్, రూరల్ హౌసింగ్ శాఖలు కలిసి ఐదేళ్లల్లో మొత్తం 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో గృహ నిర్మాణ శాఖను సమీక్షిస్తూ.. ఇళ్లు లేనివారికి అర్బన్‌లో రెండు సెంట్లు, గ్రామీణంలో 3 సెంట్లు కచ్చితంగా ఇవ్వాలని సీఎం అన్నారు. స్వంత స్థలం ఇవ్వడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వానికి సృష్టమైన ఆలోచన ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనికిరాకుండా కట్టిన ఇళ్ల డేటా మొత్తం తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ఇళ్లను జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. వైసీపీ వాళ్లు ఇచ్చిన ఇళ్లు నిర్మాణం జరిగివుంటే వాటినే లబ్దిదారులకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలని, లేనివారికి ఐదేళ్లల్లో ఇళ్లు కట్టిస్తామని సీఎం అన్నారు. ఇళ్లతోపాటు కరెంటు, నీళ్లు, గ్యాస్, సోలార్‌తోపాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. 2014-19 ఇళ్లు ఇచ్చామని.. వాటికి నిధులు ఇవ్వడంలేదని, కొంతమంది మధ్యలో నిలిపివేశారని.. వారికి ఏవిధంగా హెల్ప్‌చేయాలో ఆలోచించాలని మంత్రి పార్థసారథి కోరారు.