- మహిళాభివృద్ధికున్న అవకాశాలన్నీ వినియోగించండి
- డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి
- ఉత్పత్తులవారీగా రాష్ర్టంలో క్లస్టర్లు ఏర్పాటు చేయండి
- స్టార్బక్స్ తరహాలో అరకు, మిల్లెట్ ఔట్లెట్లు
- డ్వాక్రా, మెప్మాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే అంశాన్ని పరిశీలించండి
- సెర్ఫ్-మెప్మాపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- మెప్మా- మన మిత్ర యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): మహిళా సాధికారతకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నిరంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్నిరకాల చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే అంశంపైనా సీఎం చర్చించారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “రాష్ట్రంలోని మహిళా శక్తిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలి. డ్వాక్రా సంఘాల ఏర్పాటు తర్వాత వాళ్లల్లో చైతన్యం వచ్చింది. వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసేలా అధికారులు కసరత్తు చేయాలి” అని సూచించారు. ఐటీరంగాన్ని అభివృద్ధి చేస్తే… ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న వర్గంగా తెలుగువారు ఉన్నారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసే రోజుల్లో చాలామంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.
నిరక్షరాస్యులుగా ఉన్న మహిళల్లో చైతన్యం తెచ్చి అద్భుతాలు సృష్టించాం. ఇప్పుడు మహిళ సంఘాలు రూ.20,739కోట్లను పొదుపు చేయగలుగుతున్నారు. దీనికి రెండింతలు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకోగలుగుతున్నారు. ఈ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు చేయగలిగే సంస్థలు తక్కువ. పైగా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో ముందుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో డ్వాక్రా మహిళలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సుమారు 99 శాతంమందికి పైగా మహిళలు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నారు. కేవలం 0.02 శాతం మంది మహిళల మాత్రమే వెనక్కి తగ్గుతున్నారు. ఇంతటి పెద్ద నెట్వర్క్ ఎక్కడా ఉండదు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న పొదుపునకు మించిన స్థాయిలో మరింతగా పొదుపు చేయించడం.. వారిని వ్యాపారులుగా.. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం వైపునుంచి పూర్తి సహకారం అందించాలి. ఇదే సమయంలో డ్వాక్రా, మెప్మా మహిళల్లో ఉన్న టాలెంట్ గుర్తించాలి. డ్వాక్రా సంఘాలు పొదుపు చేసే మొత్తాలను.. వాళ్లు బ్యాంకు లోన్లద్వారా తీసుకునే రుణాలను ఏవిధంగా వినియోగించుకోవచ్చు… వాటిని మరింత సద్వినియోగం ఎలా చేయవచ్చనే అంశంపై గైడ్ చేయడానికి అవసరమైతే ఫండ్ మేనేజర్ను ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
స్వయం సహయక మహిళలకు గంటల్లో బ్యాంకు రుణాలు
“స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. గంటల్లోనే రుణాలందిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది అమలవుతుందో లేదో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించండి. తీసుకున్న రుణాలతో వ్యాపారం చేసుకునే మహిళలను ప్రొత్సహించండి. వారికి వ్యాపార అవకాశాలు మరింతగా పెరిగేలా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలి. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ రావాలి. డ్వాక్రా మహిళల్లోని టాలెంట్ గుర్తించడం… స్థానికంగా ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవడం.. టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటి అంశాల ద్వారా డ్వాక్రా మహిళల అభివృద్ధికి వంటి అంశాల ద్వారా డ్వాక్రా మహిళల అభివృద్ధికి తొడ్పాటు అందివ్వాలని సూచించారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ బిజినెస్, ఆక్వా, టూరిజంవంటి రంగాల్లో మహిళా ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్ ఉంటుందో అన్వేషించి… వారికి అవకాశాలు కల్పించాలి. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు ప్రొడెక్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.
ప్రస్తుతం డ్వాక్రా మహిళల తలసరి ఆదాయం రూ. 1,45,000గా ఉంది. ఇది మరింతగా మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఐటీని ప్రమోట్ చేశాను. దాన్ని అందిపుచ్చుకున్న వారు అత్యధిక తలసరి ఆదాయంతో ఉన్నారు. అలాగే డ్వాక్రా సంఘాలను ప్రారంభించాను. మహిళల్లో సాధికారత తెచ్చే ప్రయత్నం చేశాను. కానీ డ్వాక్రా సంఘాలు ప్రారంభించే నాటికి చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అయినా ఆ సంఘాల ద్వారా వారు అభివృద్ధి చెందారు కానీ… వారు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారస్తులుగా ఎగదాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోంది. లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళలతో ఎంఎస్ఎంఈలు స్థాపించేలా అధికారులు డ్వాక్రా మహిళల అభివృద్ధికి కృషి చేయాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
స్టార్బక్స్ తరహాలో అరకు కాఫీ.. మిల్లెట్ల అవుట్ లెట్లు
“అరకు కాఫీ-మిల్లెట్లు ఈ రెండింటి కాంబినేషన్లో అవుట్ లెట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయండి. స్టార్ బక్స్ తరహాలో ఈ అవుట్ లెట్ల డిజైనింగ్ ఉండాలి. ఈమేరకు చర్యలు తీసుకోవాలి. మునగాకుతో ఉత్పత్తులు చేయొచ్చు. మహారాష్ట్ర బ్యాంబూ మిషన్ పాలసీ తెచ్చింది.. దీనిపై అధ్యయనం చేయండి. డ్వాక్రా మహిళలతో ఈ ఉత్పత్తులు చేయిద్దాం. ఆక్వా రంగంలో రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సీవీడ్ కల్చర్ ప్రమోట్ చేద్దాం. గుర్రపు డెక్కతో ఉత్పత్తులు చేయవచ్చు. అన్నింటిని ఇంటిగ్రేట్ చేసుకుని చేయండి. డ్రోన్లను ఎగరేయడం మొదలుకుని ఎగ్కార్ట్, ఆక్వాకార్ట్, మిల్లెట్ కార్ట్ వంటివి ప్రయోగత్మాకంగా చేపట్టండి. డ్వాక్రా సంఘాల్లో కూడా పీహెల్దీ చేసిన మహిళలున్నారు. వారిని గుర్తించి.. వారి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. టూరిజం రంగం హెంప్టేలను ఏర్పాటు చేస్తోంది. వీటిల్లో డ్వాక్రా సంఘాలు వచ్చేలా చూడండి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
మెప్మా- మన మిత్ర యాప్ ఆవిష్కరణ
సమీక్ష అనంతరం మెప్మా- మన మిత్ర యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెప్మాకు సంబంధించిన 8 రకాల సేవలను యాప్లో అందుబాటులో ఉంచారు. మెప్మా చేపట్టే కార్యక్రమాలు, కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను ఆవిష్కరించారు. ప్రగ్న్యా యాప్ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మెప్మా సభ్యులకు వర్చువల్ ట్రైనింగ్ అందిస్తారు. అలాగే రూ.1.25 కోట్లను బ్యాంక్నుంచి రుణంపొంది వ్యాపారం చేస్తున్న మంగళగిరికి చెందిన మహిళను సీఎం అభినందించారు. ఈమేరకు ఆమెకు చెక్కును అందించారు. సమీక్షలో వర్చువల్గా మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్.. సెర్ఫ్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.