అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చి, పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో ఫోన్‌లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ముఖ్యంగా ఈదురుగాలులు వీస్తున్నందున మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
వాతావరణ శాఖ అధికారులు సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వాతావరణ శాఖ వర్ష పరిస్థితులపై సమాచారాన్ని విడుదల చేసిందని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, గాలులు 70 నుంచి 80 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిందన్నారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవించే ప్రదేశాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రహదారులు, కల్వర్టు పైనుండి నీరు పారే చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పాటించాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా, విద్యుత్, రెవెన్యూ, శాఖ అధికారులతో పాటు ఇతర శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.