న్యూఢిల్లీ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇస్తూ కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా కొట్టేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్రరెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన అరెస్టు అక్రమమని రాజ్ కసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదని అందులో పేర్కొన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్టీవాలా ధర్మాసనం.. ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసింది. వాటిని కొట్టివేస్తున్నట్లు తాజాగా శుక్రవారం తీర్పు వెలువరించింది.