నెల్లూరు (చైతన్యరథం): ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలు భాగస్వాములు కావాలని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఆదివారం నెల్లూరు నగరంలోని మంత్రి ఆనం నివాసంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం సహాయనిధి నుంచి 27 కుటుంబాలకు రూ.48,63,613లు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని విమర్శించారు. దీనికి సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోయారని విమర్శించారు. ఆయన ఇంట్లో కూర్చొని ప్రశ్నలు అడిగితే, అసెంబ్లీలో తాము సమాధానం చెప్పాలా అని నిలదీశారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం చట్టాలు చేసే, చర్చలు జరిపే గౌరవ సభ అసెంబ్లీ అని చెప్పారు. అలాంటి శాసన సభ అంటే జగన్‌కు కనీస గౌరవం లేదా అని ప్రశ్నించారు. జగన్ తీరుపై వైసీపీలో గెలిచిన మిగిలిన ఎమ్మెల్యేలు మనోవేదన చెందుతున్నారన్నారు. కనీసం వారినైనా సభకు రానివ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత వైసీపీకి లేదన్నారు. ఏపీలో అరాచక వాదులకు తావులేదని చెప్పారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఘోరంగా ఓడిస్తే.. అసెంబ్లీలో అధికారపక్షాన్ని ఎలా అడుగుతారని మంత్రి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థులని ప్రజలు ఓడగొట్టారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు.
గవర్నర్‌ను అగౌరవపరిచారు
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌పై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అమర్యాదకరంగా ప్రవర్తించారు. పేపర్లు చించి ఆయనపై విసిరేసి అగౌరవపరిచారు. గవర్నర్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని జగన్ కోపంగా ఉన్నాడు. జగన్‌కు రాజ్యాంగంపై, ప్రజల తీర్పుపై గౌరవం లేదు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదు. జగన్ స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది. లేదంటే ప్రజలే కనీసం ఒక్క సీటు కూడా లేకుండా తగిన శాస్తి చేస్తారని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు. కూటమి ప్రభుత్వం 20 ఏళ్ల పాలన చేస్తే కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరవు. గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కూడా జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు.