- ప్రభుత్వ శాఖల సమాచారం కోసం అందుబాటులోకి ఏపీ సెర్చ్ బార్
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. మంగళవారం సచివాలయంలోని ఆర్జీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవలు అందాలని, దీనికోసం టెక్నాలజీ సాయాన్ని తీసుకోవాలని సూచించారు. సమర్ధంగా పౌరసేవలు అందినప్పుడే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. ప్రజలనుంచి సేకరిస్తున్న సమాచారాన్ని డేటా అనలటికై విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలకు అందిస్తున్న సేవల విషయంలో టెక్నాలజీ ఆడిటింగ్ కూడా నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. వీటితోపాటు మంత్రులు, అధికారులు ఫైళ్ల క్లియరెన్సుకు ఎంత సమయం తీసుకుంటున్నారన్న అంశాన్నీ బేరీజు వేస్తామని సీఎం తెలిపారు. తద్వారా ఏస్థాయిలో ఎక్కువ ఫైళ్లు ఉండిపోతున్నాయన్న వివరాలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక సహా వివిధ సేవలు అందిస్తున్న వెబ్సైట్లు, యాప్ లు ప్రజలకు సులభంగా సేవలందించేలా తీర్చిదిద్దాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని డేటా లేక్ ద్వారా త్వరలోనే అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్యం, భూగర్భ జలాలు ఇలా వేర్వేరు రకాలుగా సేకరిస్తున్న సమాచారాన్ని సమర్ధంగా వినియోగించుకోవటం ద్వారా ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని తగ్గించాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు. టెక్నాలజీవల్ల వచ్చే ప్రయోజనంతోపాటు డేటా విశ్లేషణ ద్వారా ఫలితాలను అంచనా వేయాలని సీఎం సూచించారు.
ఏపీలో ఇప్పటి వరకూ 2.10 లక్షల గంటలమేర డ్రోన్ల వినియోగం జరిగిందని… 77 శాతంమేర వ్యవసాయ అవసరాలకు వినియోగించిన రీత్యా రైతులకు ఎంతమేర వ్యయం తగ్గింది.. అధిక పురుగుమందుల వినియోగం ఏమేరకు తగ్గించారన్న విషయాన్ని కూడా అంచనా వేయాలన్నారు. నేరాల నియంత్రణ, విచారణల్లో సీసీ కెమెరాల వినియోగం ఎంతమేర జరుగుతుందన్న అంశంపైనా సీఎం ఆరా తీశారు. అవేర్వంటి సాంకేతికత వ్యవస్థ ద్వారా ప్రకృతి విపత్తులతోపాటు వివిధ అంశాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని అంశాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రభుత్వంలోని ఏ శాఖ సమాచారమైనా ప్రజలు తెలుసుకునేందుకు ఏపీ సెర్చ్ బార్ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు సీఎంకు అధికారులు వివరించారు.