- ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం
- ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వెల్లడి
- పిఠాపురంలో రూ.100 కోట్లతో పనులు
- 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
- మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు
- రైతులకు టార్ఫాలిన్ పట్టలు పంపిణీ
పిఠాపురం(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తుందని, ప్రజా సం క్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రధా ని మోదీ మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పిఠాపురం ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసు పత్రిగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం ప్రజల కోరిక మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అదేవిధంగా నూతనంగా రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాం క్, ఆధునాతన మెషీన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో నూతనంగా డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, పాధాలజీ విభాగాలు ఏర్పా టు చేసి అందుకు సంబంధించి 66 కొత్త పోస్టులు మంజూరు చేసినట్లు వివరించారు. గతంలో గొల్లప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామా న్యులు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు వీలుగా రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. మరో హామీ చేబ్రోలు సీతారామస్వామి దేవాలయంలో హరికథలు, కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా రూ.48 లక్షల అంచనా వ్యయంతో కాలక్షేప మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. గొల్లప్రోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి రూ.కోటి 32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం.
ఉచిత టార్ఫాలిన్లతో రైతులకు అండ
2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బీసీలు, కాపు వర్గాల్లోని ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల ఆర్ధాకాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక కుట్టుమిషన్ల శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. ఎంపికైన వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నాం. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మంది మహిళలకు రూ.8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లను ఈ రోజు పంపిణీ చేశాం. అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను ఆదుకునేందుకు, పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని చిన్న, సన్నకారు రైతు ల ధాన్యాన్ని రక్షించేందుకు రూ.26 లక్షల వ్యయంతో 2 వేల టార్ఫాలిన్లు ఉచితంగా అందజేశాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను పంపిణీ చేశాం. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18.02 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సిమెంటు రోడ్లు, రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, రూ.8.68 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 431 గోకులాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సుమారు 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేసినట్లు వివరించారు. ఉపాధి హామీ ఇప్పటికే మంజూరైన రూ.21.58 కోట్ల విలువైన రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ పనుల ద్వారా 12 గ్రామాలకు ప్రధాన రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు.
త్వరలో రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యచెరువు ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆ ప్రాంతంలో మంచినీటి వెతలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పారిశుధ్యం, డ్రైన్లు, మురుగు నీటి నిర్వహణ పనులకు చేపట్ట నున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా, రోడ్లు, డైయిన్ల నిర్మా ణం, వీధి దీపాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి కోసం పిఠాపురం మున్సిపాలిటీకి రూ.3 కోట్లు, గొల్లప్రోలు నగర పంచాయతీకి కోటి మంజూరు చేశాం. రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో రెండు లక్షల మంది ప్రజలకు లబ్ది, సుమారు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పిఠాపురం రైల్వే వంతెన నిర్మాణం పిఠాపురం ప్రజల చిరకాల కోరిక. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే మంజూరు చేశారు. పిఠాపురం ప్రజల రక్షణ మా బాధ్యత. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవ హరించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
రూ.8.64 కోట్ల విలువైన కుట్టుమిషన్ల పంపిణీ
అంతకుముందు పిఠాపురం నియోజకవర్గం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ.. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల కు చెందిన 3,456 మంది మహిళలకు రూ.8.64 కోట్లు విలువైన కుట్టుమిషన్లు పంపి ణీ చేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో రైతులకు రూ.1.46 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. రైతులకు సబ్సిడీ ద్వారా పంపి ణీ చేసిన యంత్రాల్లో డ్రోన్లు, పవర్ టిల్లర్లు, టార్ఫాలిన్లు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయ ర్లు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో నూతనంగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న టీటీడీ కళ్యాణ మండపానికి, గొల్లప్రోలులో రూ.1.32 కోట్లతో నిర్మించ తలపెట్టిన సీతారామస్వామి ఆలయ ప్రాకార మండపం, చేబ్రోలులో సీతారామ స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.48 లక్షలతో రథశాల, కాలక్షేప మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం ఎకరా స్థలాన్ని విరాళంగా అందించిన విశ్రాంత ఉద్యోగి సాంబశివరావును అభినందించి సత్కరించారు. అనంతరం అక్కడే పలు వినతులు తీసుకున్నారు.
స్నేహిత్, నేహాంజనికి అభినందనలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 94వ ర్యాంకు సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్, ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించిన కాకినాడ విద్యార్థిని యాళ్ల నేహాంజని పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ వారిని అభి నందించారు. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం శంకుస్థాపనకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో మండలి విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ తోట సుధీర్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మలబాబు, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే లు పెండెం దొరబాబు, ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, బీజేపీ ఇన్‌చార్జ్ కృష్ణంరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎస్పీ బిందు మాధవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.