విజయవాడ (చైతన్యరథం): మద్యం కుంబకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. కేసులో ఏ6గా ఉన్న ఆయనను సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. శనివారం విజయవాడకు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ముగిసిన అనంతరం శ్రీధర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు.
జనాదరణ పొందిన బ్రాండ్‌లను నిలిపివేసి, నాసిరకం బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో శ్రీధర్ రెడ్డిది కూడా కీలక పాత్ర అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెలనెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు ఎలా కొల్లగొట్టొచ్చనే దానిపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలన్నింటిలోనూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, అప్పట్లో ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌తో కలిసి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. మద్యం పాలసీ ఏర్పాటులో, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునేందుకు జరిగిన సమావేశాల్లో కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. పేరున్న బ్రాండ్ కంపెనీలను పంపించేసి, సొంత తయారీ దారులను ఏర్పాటు చేయడంలో కూడా శ్రీధర్ రెడ్డి పాత్ర ఉంది.
నూతన పాలసీ విధానం, డిస్టిలరీ కంపెనీలతో ఎప్పటికప్పుడు శ్రీధర్ రెడ్డి సమావేశాలు పెట్టి పలు సూచనలు చేశారు. ప్రముఖ మద్యం బ్రాండ్‌లను ఉద్దేశపూర్వకంగా అణిచివేసేందుకు, చట్టవిరుద్ధంగా ఆర్డర్ ఫర్ సప్లై ఉత్తర్వులు జారీ చేయడంలో శ్రీధర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. డిస్టిలరీలతో సమన్వయం చేసి, సిండికేట్ సభ్యులకు సకాలంలో ముడుపులు చెల్లించేలా చూసారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగాడు. మద్యం పాలసీ రూపకల్పన, ఆయా బ్రాండ్ల ఎంపిక, ఆయా కంపెనీల నుంచి ముడుపుల ఖరారు, వాటి స్వీకరణ, వాటిని గమ్యస్థానం చేర్చడం వంటి కార్యకలాపాలు అన్నింటిలోనూ శ్రీధర్ రెడ్డి కీలక భూమిక పోషించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
“““