- టెన్త్ ఫలితాలు ఆనందాన్నిస్తోంది: లోకేశ్
- మే 19నుంచే సప్లిమెంటరీ అంటూ ప్రకటన
అమరావతి (చైతన్య రథం): ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికల్లో 84.09 శాతం, బాలురలో 78.31 శాతం పాసయ్యారు. 1,680 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. మే 19నుంచి 28వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను వెల్లడిస్తూ.. ఎక్స్ వేదికపై మంత్రి నారా లోకేష్ ఒక పోస్టు పెట్టారు. ‘ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. 4,98,585మంది ఉత్తీర్ణులై 81.14శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా 93.90శాతంతో అగ్రస్థానంలో ఉండటం, 1,680 పాఠశాలలు 100శాతం ఫలితాలు సాధించడం చూసి సంతోషం కలుగుతోంది. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. విజయం సాధించని వారు నిరుత్సాహపడకండి. జీవితం రెండో అవకాశాన్నిస్తుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 19నుండి 28 వరకూ జరుగుతాయి. ఇది విజయం సాధించడానికి మరొక అవకాశం’ అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు.