- ఏడాదిలో విద్యాశాఖ సంస్కరణలు ప్రశంసనీయం
- చదువుల వాతావరణం స్పష్టమవుతోంది…
- ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారీ బడులు
- పిల్లలందరినీ చదివించాలనే ‘తల్లికి వందనం’
- 2కోట్ల మందితో పేరెంట్ టీచర్ మీటింగ్ గొప్ప ముందడుగు
- మా హయాంలో 12 డీఎస్సీలతో 1.66 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ
- పుట్టపర్తి ఎంపిటీఎం 2.0లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- ఉపాధ్యాయుడిగా మారి విద్యార్ధులకు పాఠాలు చెప్పిన సీఎం
- తల్లి పేరిట మొక్క నాటేలా విద్యార్ధులకు మొక్కల పంపిణీ
- విద్యార్ధులతో మధ్యాహ్న భోజనంలో ముఖ్యమంత్రి, విద్యామంత్రి
- కొత్త చెరువు జెడ్పీ హైస్కూలులో 4 గంటలు గడిపిన సీఎం
- విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో సీఎం ముఖాముఖీ
సత్యసాయి జిల్లా, పుట్టపర్తి (చైతన్యరథం): విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు సీఎం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యార్ధుల తల్లితండ్రులు- ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముందు జెడ్పీ పాఠశాలలో విద్యార్ధులతో ముచ్చటించారు. కేంబ్రిడ్జి, స్టాన్‌ఫర్డ్‌లో చదువుకుని రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారని సీఎం అన్నారు. ఆధునిక దేవాలయాలైన పాఠశాలలను పరిరక్షించుకునే బాధ్యత మన అందరిదీ అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండోసారి విద్యార్ధుల తల్లితండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను అభినందిస్తున్నానని అన్నారు. గురుపౌర్ణమి రోజునే రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలల్లో 2.28 కోట్లమందితో సమావేశం నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోందని.. ఇది గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కుతుందన్నారు. మంత్రి లోకేష్ విద్యార్ధిగావున్న సమయంలో తాను కూడా పాఠశాల నిర్వహించే పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లలేక పోయానని గుర్తు చేసుకున్నారు. తన సతీమణి భువనేశ్వరి ఏ సమావేశాన్నీ విడవకుండా వెళ్లి లోకేష్‌ను కేంబ్రిడ్జిలో చదివించేంత వరకూ శ్రద్ధ పెట్టారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపట్ల శ్రద్ధ వహించి.. భవిష్యత్‌ను తీర్చిదిద్దటంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళల ఆర్ధిక సామాజిక వికాసానికి పని చేసే ప్రభుత్వంగా గతంలో డ్వాక్రా సంఘాలనే బలమైన పొదుపు వ్యవస్థను రూపకల్పన చేసి వారి అభివృద్ధికి తోడ్పాడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతీ కుటుంబంలోని పిల్లలందరినీ చదివించాలనే లక్ష్యంతో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేసి.. ఆ కుటుంబాల్లో వెలుగులు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
బాలల భవిత తీర్చిదిద్దే బాధ్యత లోకేష్‌దే
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులందరి భవిష్యత్తునూ తీర్చిదిద్దే విద్యాశాఖ బాధ్యతను మంత్రి లోకేష్ ఏరికోరి తీసుకున్నారని సీఎం అన్నారు. స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జిలాంటి విద్యాసంస్థల్లో చదువుకున్న ఆయన.. రాష్ట్రంలోని విద్యార్ధులకూ మంచి నాణ్యమైన విద్యను అందిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ‘‘గతేడాది మొదటి విడత పేరెంట్ టీచర్ మీటింగ్‌ను 44 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించాం. ఈసారి ప్రైవేటు స్కూళ్లలో సైతం సమావేశాలు నిర్వహించేలా చర్యల తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. నెల్లూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఖాళీ లేవని నో వేకెన్సీ బోర్డు పెట్టారంటే.. రాష్ట్రంలో విద్యా నాణ్యత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని సీఎం సగర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు అత్యుత్తమ నైపుణ్యముంది. రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0కు 2.28 కోట్లమంది హాజరయ్యారు. గిన్నీస్ రికార్డు సాధించేలా కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లిపేరిట ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకున్నాం. మొక్కను సంరక్షిస్తూ పురోగతి నమోదు చేసేలా గ్రీన్ పాస్ పోర్టు కూడా ఇచ్చాం. విద్యార్ధుల హాజరు, మార్కులు, ప్రవర్తన ఇలా అన్ని అంశాలను లీప్ యాప్ ద్వారా అందిస్తున్నాం. విద్యార్ధులకు నాణ్యమైన యూనిఫాం, బూట్లు, బెల్టు, బ్యాగ్‌లు ఇచ్చాం. విద్యార్ధులకు ఇచ్చిన కిట్లపై ఎలాంటి రాజకీయ నేతల ఫోటోలు పెట్టలేదు. విద్యార్థి కిట్ల కోసం రూ.980 కోట్లు వెచ్చించాం. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. విద్యార్ధుల్లో ప్రతిభ వెలికితీసి వారిని ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులు ఇస్తున్నామని.. ఈ విద్యార్ధులకు నచ్చిన కళాశాలల్లో చదువుకునేలా ప్రణాళిక చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయే కాలంలో భవిష్యత్ అంతా నాలెడ్జి ఎకానమీదేనని.. దానిని అందిపుచ్చుకునేలా విద్యార్ధులను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
డీఎస్సీలతో టీచర్ల నియామక ఘనత మాదే
కూటమి అధికారంలోకి రాగానే.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆగస్టులోగా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా శిక్షణ తీసుకుని పాఠశాలలకు వస్తారని సీఎం వివరించారు. గతంలోనూ 12సార్లు డీఎస్సీలు వేసి 1.66 లక్షలమంది టీచర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. గత ఐదేళ్లలో టోఫెల్, ఐబీ సిలబస్ పేరిట గందరగోళపరిచారని.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలను కూడా పారదర్శకంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న సంస్కరణలతోపాటు వ్యవస్థను మెరుగు పర్చేందుకు తల్లితండ్రులు, ఉపాధ్యాయుల అందరి నుంచి సూచనలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఏజెన్సీలో పెద్దఎత్తున గంజాయి పండిరచారని.. డ్రగ్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చారని సీఎం అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపామని స్పష్టం చేశారు. గంజాయి పండిరచినా, విక్రయించినా అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం హెచ్చరించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం ద్వారా మత్తు మహమ్మారిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మత్తుపదార్ధాలు విక్రయించే వారి ఆస్తుల స్వాధీనంతోపాటు ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాలు రాకుండా కట్టడి చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
వనరుల సద్వినియోగంపై విద్యార్ధులకు పాఠం
విద్యార్ధుల తల్లితండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 2.0లో భాగంగా విద్యా మంత్రి లోకేష్‌తో కలిసి కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో విద్యార్ధులు- తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. తొలుత పాఠశాల ఆవరణలో విద్యార్ధులు చిత్రించిన ‘తల్లికి వందనం’ పోస్టర్లు, కళారూపాలను సీఎం తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపోందించిన ఫొటో ఫ్రేమ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి ఫోటో దిగారు. అనంతరం విద్యార్ధులు, వారి తల్లితండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు, విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సీఎం, మార్కులు పెంచుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. విద్యార్ధులు హాజరు, మార్కుల వివరాలను స్వయంగా తల్లితండ్రులకు వివరించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు విద్యార్ధుల వివరాలను తెలియచేసేలా సమాచారం పంపుతున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్.. ముఖ్యమంత్రికి వివరించారు. విద్యార్థులను పాఠశాలకు నిరంతరం పంపేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఆర్ధిక సాయం చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలోని తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదిని పరిశీలించి వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్ఫూర్తిని నింపేలా దిశానిర్దేశం చేశారు. తర్వాత పాఠశాలలోని 8 తరగతి గదిలోకి వెళ్లిన సీఎం.. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠం చెప్పారు. సోషల్ సైన్స్‌లోని వనరులు అనే పాఠాన్ని విద్యార్థులకు బోధించారు. మరోవైపు విద్యార్థులతో కలిసి బెంచిపై కూర్చున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సోషల్ సైన్స్ పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాలను కూడా ఇతరులు మరోసారి వినియోగించుకునేలా జాగ్త్రత్తగా వాడాలని సీఎం సూచనలు చేశారు. విద్యుత్, నీరులాంటి వనరుల సద్వినియోగం సామాజిక బాధ్యత అంటూ విద్యార్థులకు వివరించి చెప్పారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలవైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.
గచ్చుపైనే కూర్చుని విద్యార్థులతో భోజనం
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి పారిపోయిందని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉందని సీఎం అన్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు పుట్టపర్తిలో స్టేడియం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కొత్తచెరువు పాఠశాల స్థల దాత, భవనాన్ని నిర్మించి ఇచ్చిన పీవీ సూర్యనారాయణ, పార్వతమ్మ దంపతులను ముఖ్యమంత్రి సత్కరించారు. మరోవైపు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ సమావేశంలో నినదించి విద్యార్ధులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తల్లి పేరిట ఒక మొక్క నాటేలా విద్యార్ధులకు ముఖ్యమంత్రి మొక్కలను పంపిణీ చేశారు. వాటి పురోగతిని నమోదు చేసేలా గ్రీన్ పాస్ పోర్టును కూడా అందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా ముఖ్యమంత్రి సమక్షంలో తమ తల్లులకు నమస్కరించి వారినుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొత్త చెరువు జెడ్పీ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి గచ్చుపైనే కూర్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు భుజించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సైతం అక్కడే విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్ధాల నాణ్యత, రుచి బాగుందని సీఎం కితాబిచ్చారు.