హైదరాబాద్ : పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి, సమస్యను పరిష్కరించకుండా సన్నాహాక సమావేశాలు, కమిటీలు, సబ్ కమిటీలు, నివేదికలు, విధి విధానాలు… పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తోందన్నారు. వర్షాకాలం ప్రారంభం అయితే పోడు భూముల వివాదాలు ప్రతి సంవత్సరం రివాజుగా మారాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని… నేను కుర్చీ వేసుకొని కూర్చొని సమస్యలన్నీ పరిష్కరించి రైతులకు పోడు పట్టాలు ఇప్పిస్తానని కేసీఆర్ 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వర్షాకాలం ప్రారంభంలో గిరిజన రైతులు పోడు భూములను దుక్కులకు చదును చేసుకునేవారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గిరిజన రైతుల ఆత్మహత్య యత్నాలు, అరెస్టులు రాష్ట్రంలో జరుగుతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలని కూడా చూడకుండా అధికారులు దాడులు చేశారని మండ్డిపడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూములను సాగు చేసుకోవడానికి వెళ్లిన రైతులపై అధికారులు దాడులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందన్నారు.
ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నాన్చే కొద్దీ ప్రమాదం పొంచి ఉందని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కొత్త సచివాలయాన్ని నిర్మించ తలపెట్టిన వెంటనే కేసీఆర్ పాత సచివాలయాన్ని కూల్చి వేసి కొత్త సచివాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. అంతే శ్రద్ధను పోడు భూముల సమస్యను పరిష్కరించడంపై కూడా కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది గిరిజన, గిరిజనేతరులు 13 లక్షల ఎకరాల పోడు భూముల క్రమబద్ధీకరణ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ దరఖాస్తులను పరిశీలించి అటవీ భూముల హక్కుల చట్టం(ఆర్‌ఓఎఫ్‌ఆర్)-2006, పెసా చట్టం ప్రకారం ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టా హక్కు మంజూరు చేయాలి. గిరిజన రైతులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.