ఏలూరు (చైతన్యరథం): రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు ఇచ్చారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా నాయకులతో మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి నాదెండ్ల సమీక్షించారు. సభను విజయవంతం చేయాలని దిశా నిర్దేశించారు. అనంతరం రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఆనాడు రాజధాని అమరావతి నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు పెద్ద మనసుతో 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా అందించారన్నారు. రాజధాని పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి, పనులు జరుగుతున్న దశలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిపై అక్కసుతో పనులను నిలిపివేసి, 3 రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చిందన్నారు. జగన్ మూడు ముక్కలాటను ప్రజలెవరూ నమ్మలేదని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఎంతో సహనంతో ఉద్యమాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పనులు మళ్ళీ మొదలు పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మే, 2వ తేదీన అమరావతి వస్తున్నారన్నారు. ప్రధానిని ఘనంగా స్వాగతించాలని, ఏలూరు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల కోరారు. మంచి రాజధాని ఉన్నప్పుడే రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సులను ఏర్పాటుచేశామని, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సిద్ధంగా 5 కోట్ల గోనెసంచులు
రైతులు పండిరచిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా 5 కోట్ల గోనె సంచులను సిద్ధంగా ఉంచామన్నారు. గతంలో ఎకరాకు 30 నుండి 32 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో 64 నుండి 70 బస్తాల దిగుబడి వస్తున్నదని, ఇది మంచి పరిణామమన్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లో 10 వేల కోట్ల రూపాయలకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటలలోగా రైతుల ఖాతాలో సొమ్ము జమచేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.