రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, అన్యాయంగా తమపై కేసులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రజాస్వామ్య హంతకుడు జగన్ రెడ్డే. హిట్లర్, ఒక ముస్సోలిని, ఈడీ అమీన్, కిమ్ ఆలోచనల ప్రతి రూపమే జగన్ రెడ్డి. అహంకారంతో, ఫ్యూడలిస్టు స్వభావంతో పరిపాలన సాగించిన జగన్ ప్రజాస్వామ్యం గురుంచి మాట్లాడటం చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గుతో తలదించుకొంటున్నారు. జగన్‌వంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడిని ప్రజలు మునుపెన్నడూ చూసివుండరు. అధికారంకోసం వికృత ఆలోచనలు, శవాలు, అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. అత్యంత క్రూరుడుగా పేరుమోసిన గ్రీస్ రాజు డ్రాకోనియన్‌ను మించి జగన్‌రెడ్డి అరాచక, అకృత్యాల పాలన సాగించారు. నిజానికి జగన్‌రెడ్డి నరహంతక పాలనే సాగించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో చట్టాలు, లా-అండ్ ఆర్డర్ నిర్వీర్యమైంది. ప్రజాసామ్యం, రాజ్యాంగం, విలువలతో నాకు సంబంధం లేదు. నేను చేసిందే చట్టం, నేను చెప్పిందే రాజ్యాంగమన్న చందంగా నిరంకుశంగా వ్యవహరించారు. రాజ్యాంగమైనా, ప్రజాస్వామ్యమైనా, న్యాయవ్యవస్థ అయినా, మీడియా అయినా, ప్రతిపక్షాలైనా, ప్రజలయినా మా వెనక నడవాల్సిందే. మాకునచ్చిన విధంగా వ్యవహరించక పోయినా, మాకు అనుకూలంగా తీర్పులు రాకపోయినా సహించేది లేదన్న విధంగా వ్యవహరించిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగమంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
ప్రజాస్వామ్యం అన్న పదం జగన్ నోటివెంట తప్ప ఐదేళ్ల పాలనలో ఎక్కడా కనపడలేదు. రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రజాస్వామ్య వ్యవస్థనే పాతరేశారు. ఐదేళ్లు రాష్ట్రం రావణకాష్టంలా రగిలింది. దళితులకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, నిద్రకరువైన పాలన, రాక్షసులే నయం అనుకునేలా పాలన సాగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నవారు 21వ శతాబ్దంలో వున్నామా? ఆటవిక యుగంలో వున్నామా? కిరాతక పాలనలో వున్నామా? అని ఆందోళన చెందారు ప్రజలు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలపై, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. సామూహిక హత్యలు, సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు జరగని రోజు లేదు. మాయ చట్టాలు తెచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు మహిళలను మభ్యపెట్టారు. శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, గృహనిర్బందాలు, కక్ష సాధింపులతో జర్మనీలో నాజీల దురాగతాలను కళ్ళకుగట్టింది జగన్ పాలన. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం దళితులు, బీసీలు, మహిళలుపై దాడులు పెరిగాయి. వారు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. ఇండియన్ ఫీనల్ కోడ్.. ఐపీసీని వైసీపీ పీనల్ కోడ్‌గా మార్చారు. దళిత యువకులకు పోలీసు స్టేషన్లలో శిరోముండనాలు చేశారు. రాజధానికి భూములిచ్చిన ఎస్సీ రైతులకు సంకెళ్లు వెయ్యడంవంటి చర్యలతో అరాచక, అనాగరిక పాలన సాగించారు. ఎస్సీ,ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసంవున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును దుర్వినియోగం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎస్సీల పైనే ప్రయోగించి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు. న్యాయ వ్యవస్థకు పక్షపాతం అంటగట్టి తన తప్పులను, వైఫల్యాలను సమర్ధించుకున్నారు. న్యాయమూర్తులపై దాడికి దిగారు. తాము అనుకున్నట్లు తీర్పులు రాకపోవడంతో న్యాయమూర్తులను దూషించడం, దురుద్దేశాలు ఆపాదించడంవంటి చర్యలు పతాకస్థాయికి చేరాయి జగన్ పాలనలో. విమర్శించే వారిపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం వంటి చర్యలతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాలరాశారు. ప్రశ్నిస్తే సంకెళ్లు, ఎదురు తిరిగితే జైళ్ళు అన్న విధంగా వ్యవహరించారు. శాంతియుతంగా ప్రదర్శనలు, నిరసనలు జరిపే ప్రాథమిక హక్కు రాజకీయ పార్టీలకు, ప్రజలకు ంది. హింసకు తావులేకుండా వారి హక్కును వినియోగించుకునేలా పోలీసులు తోడ్పడాల్సి ఉంది. కానీ నిరంకుశంగా వ్యవహరించి వారి హక్కును కాలరాసేలా నాయకులను అక్రమ గృహ నిర్బందాలతో శాంతియుత ప్రదర్శనలు అడ్డుకొని ప్రాధమిక హక్కులను కాలరాశారు. ప్రజలకు దన్నుగా నిలుస్తున్నవారిపై పోలీసులు దమన కాండ సాగించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ, మానవీయ విలువలకు ప్రాధాన్యత లేకుండా చేశారు. పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలోను పక్షపాతంతో, స్వార్ధంతో వ్యవహరించారు.
అటు రాజకీయ ప్రయోజనాల కోసం, ఇటు ఆర్ధిక ప్రయోజనాల కోసం సొంత పత్రికకు, చానల్‌కు 70 శాతం ప్రకటనలు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇతర మీడియా సంస్థలను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రకటనలు ఇతర పత్రికలకు నిలిపివేశారు. పోలీసులను అడ్డగోలుగా ఉపయోగించి 3,500కు పైగా ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. 2600 మందికిపైగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గతంలో చంద్రబాబుపై ఒక్క బాబ్లీ కేసు మాత్రమే ఉండేది. జగన్ హయాంలో 17 కేసులు పెట్టారు. పవన్ కల్యాణ్‌పై 7 కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 66 కేసులు పెట్టారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. అక్రమ కేసుపెట్టి కొల్లు రవీంద్రను 50 రోజులకు పైగా జైలులో పెట్టారు. పులివెందులలో పోటీ చేసిన బీటెక్ రవిని ఏ కారణం చెప్పకుండా జైల్లో పెట్టారు. అధికారులపై దాడి చేశారంటూ కూన రవికుమార్‌పై కేసులు నమోదు చేశారు. ఫర్నిచర్ దుర్వినియోగం చేశారంటూ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారు. ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుత హోం మంత్రి, టీడీపీలోని ఎస్సీ నాయకురాలు వంగలపూడి అనితపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు అత్యాచారయత్నం కేసు పెట్టారు.
అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును లాకప్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేసింది జగన్ సర్కారు. ఎంపీ అయిఉండి కూడా, ఐదేళ్లపాటు సొంత నియోజకవర్గంలోకి రాకుండా భయానకవాతావరణం సృష్టించారు. అమరావతిలోని రైతులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడలేదు. కేసులు, అరెస్టులు, సోషల్ మీడియాలో బూతులతో వారిని చిత్రహింసలు పెట్టారు. నోరెత్తాలంటే భయపడాలన్న నియంతృత్వ పోకడలతో చంద్రబాబును స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు జరిగిన తర్వాత ఎనిమిది నెలల పాటు వైసీపీనే అధికారంలో ఉంది. కానీ, ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. రాష్ట్రంలో చట్టబద్ద పాలనకు సమాధి కట్టి పోలీస్ రాజ్యం స్థాపించారు. గతంలో ఏ ప్రభుత్వం ఈవిధంగా నిరంకుశంగా, అప్రజాస్వామిక రీతిలో పరిపాలించలేదు. పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడటానికి పోలీసులు వున్నారుతప్ప, పోలిటికల్ బాస్‌లు చెప్పినట్లు వ్యవహరించడానికి కాదని, పోలీసు అధికారులను నియంత్రించలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా? అని హైకోర్టు పదేపదే ప్రశ్నించడమంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా వుందో ఆనాడు! జగన్ ఏలుబడిలో పత్రికా స్వేచ్ఛపై ఎన్నడూ లేనంతగా దాడులు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఆవిధంగా జర్నలిస్టులపై, పత్రికలపై దాడులు అంతకు ముందెన్నడూ జరగలేదు. విలేకర్లపై హత్యాయత్నాలకు పాల్పడటం, పత్రికా కార్యాలయాలపై రాళ్ళ దాడులు చేయించడం వంటి ఫ్యాక్షన్ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, నిరశిస్తే తట్టుకోలేక విచక్షణారహితంగా ప్రజాస్వామిక హక్కుల పీక నులిమారు.
తమతప్పులు ఎత్తి చూపే మీడియా ఉండకూడదు. తమ తప్పులు రాసే కలాలు, ప్రశ్నించే గొంతులు ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తూ రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులను కాల రాసారు. మీడియా గొంతు నులిమెందుకు జీఓ 2340 జారీ చేసింది జగన్ ప్రభుత్వం. మూర్ఖంగా మా పరిపాలన మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్‌ని అగాధంలోకి నెట్టారు. ఈవిధంగా అనేక ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజాస్వామ్యంలో పాటించవలసిన కనీస సూత్రాలను, రాజ్యాంగబద్ద పాలనను విస్మరించించి నియంతలా తాను అనుకొన్నవన్నీ చెయ్యడమే కాకుండా అపురూపంగా చూసుకోవాల్సిన విలువలను, వ్యవస్థలను, పౌరహక్కులను, భావప్రకటనా స్వేచ్చను కాలరాసి రాష్ట్రంలో అరాచకానికి, అశాంతికి తెరతీసిన జగన్‌రెడ్డి నేడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యమంటూ నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగహంతకుడైన జగన్‌రెడ్డికి పవిత్రమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మాట్లాడే హక్కులేదు అంటున్నారు ప్రజలు.
నీరుకొండ ప్రసాద్