- అమెరికా సంస్థలకు మంత్రి లోకేష్ పిలుపు
- యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీలో పారిశ్రామిక పాలసీలు
- అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు
- డిసెంబర్ నుంచి అమరావతి పనులు
- 5 బిలియన్ల డాలర్లతో రాజధాని ప్రాంతం అభివృద్ధి
- ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఏవియేషన్ వర్సిటీ, డేటా సెంటర్ ఏర్పాటు
- శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం
శాన్ఫ్రాన్సిస్కో (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, యువతకు రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఆరు పాలసీలను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్.. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అమెరికా సంస్థల నుంచి రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడుల కోసం 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఎదురుచూస్తున్నారన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా కంపెనీ రావటం ఒక ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. దేశంలోనే 2వ సుదీర్ఘ తీరప్రాంతం ఏపీకి పెద్ద అనుకూలత అన్నారు. రాష్ట్రంలో త్వరలో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25శాతం ఏపీలోనే తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 శాతం ఏసీలు కూడా ఏపీలోనే తయారవుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని పనులు
కృష్ణా, గుంటూరు, క్యాపిటల్ రీజియన్‌లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం. డిసెంబర్ నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు.. ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టి సారించాం. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయి. త్వరలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడీబీని పునరుద్ధరించాం. రాజకీయంగా జాతీయస్థాయిలో కీలకపాత్ర వహిస్తుండటం ఏపీకి కలసి వస్తోంది. భారత్‌లో డేటా రివల్యూషన్ రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఏపీ కీలకపాత్ర పోషించబోతోంది. ప్రధాని మంత్రి మోదీ 2047 `వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఏపీ వేగవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికాలోని వివిధరంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కండి: శ్రీకర్ రెడ్డి
శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఐటి మంత్రి లోకేష్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో కాన్సులేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకుందన్నారు. ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి, ఫాల్కన్ ఎక్స్ కో ఫౌండర్ రాజు ఇందుకూరి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రావు సూరపనేని, ఏ 5 కార్పొరేషన్ సీఈఓ వినయ్ కృత్తివెంటి, అప్లయ్డ్ మెటీరియల్స్ సీటీిఓ ఓం నలమాసు, పై డేటా సెంటర్ సీఈఓ కళ్యాణ్ ముప్పనేని, గ్లోబల్ ఇండస్ట్రీ ఎనలిస్ట్స్ సీఈఓ రాంరెడ్డి, ఐటి సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హరి గక్కని, సురేష్ మానుకొండ, వినోద్ బాబు ఉప్పు, వినయ్ పర్చూరి, రిఫిక్స్ ఏఐ సీఈఓ అనిరుథ్ రెడ్డి, క్లియర్ స్టోన్ వెంచర్ డైరెక్టర్ విష్ మిశ్రా, టీసీిఎస్ బిజినెస్ యూనిట్ హెడ్ కేశవ్ వర్మ, నడ్జ్ ఏఐ సీఈఓ సారీన్ షా, వెస్ట్ బ్రిడ్జి క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ రవి కన్నెగంటి, బాటా ప్రతినిధులు విజయ ఆసూరి, జయరామ్ కోమటి, సిలికానాంధ్ర ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభొట్ల, కార్యదర్శి రాజు చామర్తి, హాస్ బిజినెస్ స్కూల్ డైరక్టర్ ప్రొఫెసర్ సోలోమన్ డార్విన్, సోలిక్స్ టెక్నాలజీస్ సీఈఓ సాయి గుండవల్లి, ఐసెరా కో ఫౌండర్ ముద్దు సుధాకర్, టాల్ హాస్పటల్స్ సీఈఓ కిషోర్ గాదిరాజు, ఏపీ ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.