అమరావతి (చైతన్యరథం): పాస్టర్లకు గౌరవ వేతన బకాయిల విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు, పాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం సీఎంఓలో ముఖ్యమంత్రిని చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటె స్వామిదాసు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ముందు రోజే పాస్టర్స్‌కు గౌరవ వేతనం ఒక్కొక్కరికి రూ.60 వేలు అకౌంట్‌లో జమ చేయడం చాలా సంతోషకరమన్నారు. పేదల సంక్షమమే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2024 డిసెంబర్ నుండి 2025 నవంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8427 పాస్టర్స్ కు రావలసిన 12 నెలల గౌరవ వేతనం రూ. 52 కోట్ల 40 లక్షలు నిధులు విడుదల చేసినందులకు సీఎం చంద్రబాబుకు పాస్టర్స్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిగా పెండిరగ్‌లో ఉన్న గౌరవ వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయటంతో ఒక్కొక్క పాస్టర్ ఖాతాలో రూ.60 వేలు జమయ్యాయని తెలిపారు. క్రిస్మస్ పండుగ ముందుగా గౌరవ వేతనం పడినందుకు పాస్టర్స్ రెట్టింపు ఉత్సహంతో క్రిస్మస్ పండుగ చేసుకున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనే పాస్టర్లకు గౌరవేతనం ఇవ్వటం లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ వేతనం ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిషప్ జె వి ప్రసాద రావు, బిషప్ పొన్నామటి బాబ్జి, నూజివీడు డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ టి ప్రభాకర్ రావు, పాస్టర్ ప్రేమ్ చంద్ పాల్గొన్నారు.















