- ‘ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’పై వర్క్‌షాప్
- ప్రారంభోపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు
- కేస్ స్టడీలతో అవగాహన కల్పించిన నిపుణులు
- కీలక అంశాలపై నేడు సెకెండ్ సెషన్
అమరావతి (చైతన్య రథం): ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’’పై రెండురోజుల వర్కుషాపు సచివాలయంలో గురువారం ప్రారంభమైంది. ఏఐ ఆధారిత సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజాసేవను వేగవంతం చేసేందుకు అవసరమైన అవగాహనను ప్రభుత్వ యంత్రాంగానికి కల్పించడమే దీని లక్ష్యం. ఐటీఈ`సీ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోన్న వర్క్‌షాప్ తొలిరోజు సెషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాగింది. పాలనలో కృత్రిమ మేధస్సు సామర్థ్యం మరియు డిజిటల్ పరివర్తన వ్యూహాలపై అధికారులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సెషన్ సాగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పరిచయంతో ప్రారంభమైన వర్కుషాపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. పాలన, ప్రజాసేవను మెరుగుపర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
అనంతరం ఎంఈఐటీవై, డాట్ మాజీ కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్.. ఈ-గవర్నెన్స్ నుంచి ఏఐ-గవర్నెన్స్‌కు పరివర్తనపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతికత చాలా శక్తివంతమైంది. స్వల్పకాలంలో సాంకేతికత ప్రభావాన్ని అతిగా అంచనా వేయడం.. దీర్ఘకాలంలో తక్కువగా అంచనా వేయడం సర్వసాధారణం. అలాకాకుండా.. సాంకేతిక వినియోగానికి ముందుగా సంసిద్ధమయ్యేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఏఐ ఆధారిత టెక్నాలజీ భారత్ మరియు ఆంధ్రలాంటి రాష్ట్రాలకు ఎంతో ఉపయుక్తం’ అన్నారు.
ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాల ద్వారా పాలనా సామర్థ్యంపై ఏఐ అంతర్గత ప్రభావం.. పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిపై బాహ్య ప్రభావం రెంటినీ ప్రజెంటేషన్‌లో వివరించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం నుంచి వచ్చిన కేస్ స్టడీలత ఏఐపై అవగాహన కల్పించారు. కృత్రిమ మేథ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను 50శాతం, వ్యవసాయ ఇన్‌పుట్ ఖర్చులను 25శాతం ఎలా తగ్గించగలదో, అట్టడుగుస్థాయిలో వ్యవస్థాపక నమూనాల ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలను ఎలా సృష్టిస్తుందో చంద్రశేఖర్ తన ప్రజెంటేషన్‌లో వివరించారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ.. భారత్ 1శాతంకంటే తక్కువ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తుంటే.. చైనా 80శాతం పైబడి వినియోగంలోకి తెచ్చిందని.. ఇది వృద్ధికి, ఉపాధి కల్పనకు సూచికగా పేర్కొన్నారు.
వాద్వానీ ఫౌడేంషన్ (డబ్ల్యుజీడీటీ) సీఈవో ప్రకాష్‌కుమార్ నేతృత్వంలో మధ్యాహ్నం సెషన్ జరిగింది. బహుళ ప్రభుత్వ రంగాలలో ఏఐ ఆచరణాత్మక అనువర్తనాలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి డబ్ల్యుజీడీటీ నిబద్ధతను నొక్కిచెబుతూ, ప్రణాళిక పూర్తిగా అమలయ్యేలా ఎక్కువ కాలం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. పాఠశాల విద్య, పట్టణ మౌలిక సదుపాయాలు, వైద్యం`ఆరోగ్యం, ప్రభుత్వ పాలన, జాతీయ కుటుంబ సర్వే, వ్యవసాయం.. ఇలా భిన్న రంగాలలో ఏఐ సాంకేతికతను వినియోగించి ఎంతటి అద్భుత ఫలితాలు సాధించవచ్చో కేస్ స్టడీలతో సహా వివరించారు. ఇంటరాక్టివ్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్‌తో తొలి రోజు వర్కుషాపు ముగిసింది. కంప్యూటర్ విజన్ అప్లికేషన్లు, వాణిజ్య పన్ను శాఖ ఏఐ సాధనాలు, ‘‘ఏఐ ప్లేబుక్’’ ద్వారా భావనల నుండి పైలట్ ప్రాజెక్టులకు మారడంపై మార్గదర్శకత్వం వంటి ఆచరణాత్మక ప్రదర్శనలు శుక్రవారం రెండోరోజు వర్కుషాపులో వివరించనున్నారు.