- హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి
- ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు
- టెక్నాలజీ సాయంతో నేరాలకు అడ్డుకట్ట
- జగ్గయ్యపేటలో సీసీ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి
జగ్గయ్యపేట (చైతన్యరథం): అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఆటలు ఇకమీదట సాగనివ్వబోమని, టెక్నాలజీ ద్వారా వారికి అడ్డుకట్ట వేస్తామని హోం మంత్రి వంగపూడి అనిత స్పష్టం చేశారు. విజయనగరంలో ఇటీవల డ్రోన్లు ఎగరేసి పేకాటరాయుళ్లను పట్టుకున్నామని వెల్లడిరచారు. ఇన్విజిబుల్ పోలిసింగ్‌కు ఈ ఘటన నిదర్శనంగా హోంమంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సీసీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్‌ను హోంమంత్రి అనిత గురువారం ప్రారంభించారు. కొత్తగా 509 సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణలో జగ్గయ్యపేట సర్కిల్ నమూనాగా నిలుస్తుందన్నారు. త్వరలోనే తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ విషయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చొరవను హోంమంత్రి అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తోన్న సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి ప్రశంసించారు. జగ్గయ్యపేటలోని 71 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తామని మంత్రి చెప్పారు.
ప్రతి ఇంటికి సీసీ కెమెరా అనివార్యం
గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో నేరస్థులు ఎక్కడికక్కడ చెల్లాచెదురవుతున్నారన్నారు. కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1000 సీసీ కెమెరాలు, 28 డ్రోన్‌లు ఏర్పాటు చేశామన్నారు. టీవీ, ఫ్రిడ్జి, ఏసీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరా కూడా కచ్చితంగా ఉండాలన్నారు. మద్యం, డ్రగ్స్, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. శక్తి యాప్, శక్తి టీంలు మహిళలను రక్షిస్తాయన్నారు. పోక్సో యాక్ట్‌తో పాటు తప్పు చేస్తే శిక్షపడే చట్టాలకు ప్రచారం కల్పిస్తామన్నారు. నేర నియంత్రణలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని మంత్రి అనిత పిలుపు ఇచ్చారు.
స్టాటిస్టిక్స్ ఆఫ్ షేమ్’ పుస్తకావిష్కరణ
హెల్మెట్ లేదని పోలీసులు పట్టుకుంటే నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసే పరిస్థితి వాహనదారులకు మంచిది కాదని హోంమంత్రి హితవు పలికారు. ఫోన్‌కి స్క్రీన్ గార్డు వేయిస్తారు..విలువైన ప్రాణాన్ని రక్షించే హెల్మెట్ పెట్టుకోరా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. హెల్మెట్ వాడని వారిపై జరిమానాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమన్నారు. హెల్మెట్ వినియోగిస్తే జరిమానా కట్టనవసరం లేదు. ప్రమాదం బారిన పడాల్సిన అవకాశం ఉండదన్నారు. హెల్మెట్ వినియోగం మన ప్రాణాల్ని రక్షించడానికేనని యువత అర్థం చేసుకోవాలన్నారు. పోక్సో చట్టానికి సంబంధించిన ‘స్టాటిస్టిక్స్ ఆఫ్ షేమ్’ పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. పుస్తకం కోసం కృషి చేసిన పోలీసు ఉన్నతాధికారులకు హోంమంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. పోక్సో కేసుల్లో బాధితులు, నిందితులంతా నిరక్షరాస్యులే ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, డీసీపీలు గౌతమి, సరిత, ఉదయరాణి, సురక్ష కమిటీ కన్వీనర్ నర్సయ్య, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, జగ్గయ్యపేట ప్రజలు పాల్గొన్నారు.