- పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రణాళిక
- రాష్ట్రంలోని ‘ప్రత్యేకత’కు ప్రాచుర్యం కల్పించండి
- శాంతి భద్రతలూ.. పర్యాటకానికీ కీలకం
- భద్రతలేని చోటుకి పర్యాటకులు రారు
- రానున్న ఆరు నెలల్లో కార్యాచరణకు సిద్ధంకండి
- కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు…
అమరావతి (చైతన్య రథం): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రగతిశీల ప్రణాళికలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. అన్ని వ్యవస్థలతోపాటు గత ఐదేళ్లలో పర్యాటక రంగాన్నీ వైకాపా పాలకులు నిర్వీర్యం చేసిన నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం శరవేగంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. రెండోరోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుకు అధికార్లు అందించిన నివేదిక ప్రకారం గత ఆర్నెల్ల కాలంలో రూ.ఆరువేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు రంగం సిద్ధమైంది. అధికారులు అందించిన లెక్కల ప్రకారం.. క్లబ్ మహింద్రా రూ.1000 కోట్లు, ఒబెరాయ్ రూ.2100 కోట్లు, తాజ్ హోటల్స్ రూ.428 కోట్లు, రాడిసన్ రూ.1250 కోట్లు, అట్మోస్ఫియర్ రూ.1200 కోట్లు, ఫోర్ సీజన్స్ రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. కలెక్టర్ల సదస్సులో పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు సమీక్షిస్తూ.. రాష్ట్రానికి టూరిజాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు కలెక్టర్లంతా నిర్దుష్ట ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. ఏపీలో ఉన్నన్ని అద్భుత ప్రదేశాలు ప్రపంచంలో మరెక్కడా లేవంటూనే.. ఆయా ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పర్యాటకరంగ అభివృద్ధికి ఆ ప్రాంతంలోని శాంతి భద్రతలు కీలకమని అంటూనే.. భద్రతలేని చోటుకి పర్యాటకులు వచ్చేందుకు ఇష్టపడరని చంద్రబాబు హెచ్చరించారు. జిల్లాల్లోని శాంత్రి భద్రతలపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. పర్యాటకరంగ అభివృద్ధికి వచ్చే ఆరు నెలల్లో కార్యాచరణ మొదలుకావాలని, నిర్దుష్ట ప్రణాళికల అమలుకు సన్నద్ధం కావాలని కలెక్టర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సమావేశంలో టూరిజం అభివృద్ధికి తగు లక్ష్యాలను నిర్దేశిస్తూ.. ప్రపంచస్థాయి హోటల్స్ రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షణీయ ప్రణాళికలు అమలు చేయాలని, ఏపీ వంటకాలను ప్రోత్సహించడం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టి పర్యాటకులను ఆకర్షించాలని చంద్రబాబు సూచించారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించుకుని విస్తృత ప్రచారం కల్పించాలని మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకరంగ ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రా టూరిజం పాలసీకి కేంద్రంనుంచి ప్రశంసలు అందాయని, దేశంలో అత్యుత్తమైన పాలసీగా ఏపీ టూరిజం పాలసీని కేంద్రం గుర్తించిందని వివరించారు. రాష్ట్రం అనుసరిస్తోన్న విధానం.. పెద్ద గ్రూపుల పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తోందని, ఒబెరాయ్, తాజ్, మహింద్రా, మేఫైర్ వంటి సంస్థలు పర్యాటకంపై పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నాయని వివరించారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఐదు స్టార్ హోటళ్లకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు.
ఈవెంట్స్ క్యాలెండర్ మరియు బ్రాండిరగ్
ఈవెంట్స్ క్యాలెండర్ సిద్ధమైందని, బ్రాండిరగ్ కోసం ఏజెన్సీ నియామకం పూరైనట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంప్రదాయాలు, కళలు, పండుగలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఏడాది పొడవునా ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడంపై దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగ ప్రగతికి ఏడు గమ్యస్థానాలు గుర్తించినట్టు వివరిస్తూ.. విశాఖపట్నం, అరకు-లంబసింగి, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట,తిరుపతి ప్రాంతాలను పేర్కొన్నారు. పాలసీలో 25 థీమ్ ఆధారిత పర్యాటక మార్గాలు చేర్చారు. 2025 ఫిబ్రవరి నాటికి డీపీఆర్‌లు సిద్ధమవుతాయన్నారు.
ప్రాజెక్టులు, ఫండిరగ్:
సాస్కి స్కీం కింద రూ.172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి పనులు.
స్వదేశ్ దర్శన్ 2.0, సాస్కి స్కీం క్రింద రూ.250 కోట్ల పెట్టుబడులు.
శ్రీశైలం, అమరావతి, బీచ్ కారిడార్ల అభివృద్ధి.
అరకు-లంబసింగి, కోనసీమ, పాపికొండలు అభివృద్ధి పనులు ప్రారంభం.
భారీఎత్తున పెట్టుబడులు మరియు ఉద్యోగాలు.
రూ.6.5వేల కోట్ల పెట్టుబడులతో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటు.
25 వేలకుపైగా ఉద్యోగాల కల్పనకు లక్ష్యం.