- మంత్రి డోలా ఉద్ఘాటన
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి
కొండపి (చైతన్యరథం): పల్లె సీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను గురువారం కొండపి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ప్రారంభించి సంబంధిత గ్రామ పంచాయతీలకు మంత్రి డోలా అందచేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పల్లె సీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద 2 వేల జనాభా కలిగిన గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా తొలి విడతలో రాష్ట్రంలో 55.44 కోట్ల రూపాయలతో 903 ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ప్రకాశం జిల్లాకు 120 ట్రాక్టర్లను రూ.7,36,80,000తో కేటాయించగా, కొండపి నియోజక వర్గానికి రూ.1.10 కోట్ల రూపాయలతో 18 ట్రాక్టర్లను కొనుగోలు చేసి నియోజక వర్గ పరిధిలోని ఆరు మండలాలలోని 18 గ్రామ పంచాయతీలకు కేటాయించామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు ఎందుకు చేయలేదని మంత్రి డోలా ప్రశ్నించారు.
ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయడం తప్ప ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెద్ద పంచాయతీలకు డ్రెయిన్ క్లీనర్స్‌ను కూడా మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది నాడు పీ 4 కార్యక్రమాన్ని ప్రారంభివచనున్నట్లు మంత్రి డోలా తెలిపారు.