- పేద రైతుల భూములు ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించారు
- సౌదీలో అక్రమ నిర్బంధం, నా భర్తను స్వదేశానికి రప్పించండి
- మంత్రి లోకేష్ 48వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు
- సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని మంత్రి భరోసా
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజాదర్బార్‌కు సోమవారం మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ నాయకుడు వైఎస్ మధు పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన సి.అమ్మాజీ.. మంత్రి లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం పులివెందులకు చెందిన షేక్ సాయి అనే వ్యక్తికి దశలవారీగా రూ.40 లక్షల వరకు అప్పు ఇచ్చాం. ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించకపోగా..మాపై వేధింపులకు పాల్పడుతున్నాడు. తాము వైసీపీ వ్యక్తులమని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మధు అనుచరులమంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయడంతో పాటు తమకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం, దరిమడుగులో పేద రైతులకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి, వైసీపీ నేత ఆదిమూలపు సురేష్, అతని సోదరుడు ఆదిమూలపు సతీష్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించారని, విచారించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి, దర్శికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ…మంత్రి లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 2003లో ఆదిమూలపు సురేష్ తండ్రి దివంగత ఆదిమూలపు శ్యామ్యూల్ జార్జ్.. సర్వే నెంబర్ 841/1లో ఆరుగురు పేదరైతులకు చెందిన భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అనంతరం ఆయా భూముల్లో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించి రైతులకు ద్రోహం చేశారు. సదరు భూముల కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, ఏ అధికారి ఇంతవరకు స్పందించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. విచారించి తమ భూములు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1,800 మందికి వేతనాల పెంపుతో పాటు సర్వీస్‌తో కూడిన FTE
(FIXED TENURE EMPLOYEE) వర్తింపజేయాలని రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై భారం పడకుండానే ఆప్కాస్ ద్వారా ఎఫ్‌టీఈ కన్వర్షన్ చేసి ఆదుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
సౌదీ అరేబియాలో అక్రమ నిర్బంధానికి గురైన తన భర్త షేక్ ఇస్మాయిల్‌ను విడిపించి స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన షేక్ నగీన.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన భర్త ఏడేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లి రొవాడ ఖలీద్ బిన్వాలిద్‌లో డ్రైవర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ కారు ప్రమాదానికి గురైందని, ఆ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. తన భర్త తప్పులేకపోయినా కారు యజమాని కేసు నమోదుచేయడంతో పాటు తన భర్త పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకుని రూ.7 లక్షల నగదు డిమాండ్ చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తను స్వదేశానికి తీసుకువచ్చేలా సాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజారవాణా శాఖలో రెగ్యులర్ డ్రైవర్లుగా నియామక పత్రాలు పొందిన తమకు పూర్తి జీతం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న తమను గతేడాది క్రమబద్ధీకరించారని, అయితే 14 నెలలుగా పూర్తి జీతం రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్, ఆల్ఫా సెంటర్, శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణంతో పాటు పూర్తి నిడివిగల రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయా ప్రాంతాల నివాసితులు.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి డ్రైనేజీ నీటిని మళ్ళించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.