- ‘రామ్‌లీలా’లో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవం
- బీజేపీలో 5వ మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు
- మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా,
- రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ ప్రమాణం
- హాజరైన ప్రధాని మోదీ, పలువురు సీఎంలు, కేంద్రమంత్రులు
- ఏపీనుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరు
- 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా రెపరెపలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢల్లీిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న భాజపా.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఉదయం ఇంటినుంచి బయల్దేరిన రేఖాగుప్తా.. హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె రామ్‌లీలా మైదానానికి చేరుకొని, అందరినీ పలకరించారు. కార్యక్రమానికి సాధువులు, పలువురు ప్రముఖులు హాజరుకావడంతో భారీ భద్రత ఏర్పాటుచేశారు. 25వేలమంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రేఖా గుప్తాతోపాటు భాజపా ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త సీఎంకు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించనున్నారు.
రేఖా గుప్తా ప్రస్థానమిది..
హరియాణాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌గామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢల్లీి వర్సిటీ విద్యార్థి సంఘ కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌదరీ చరణ్‌సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకొని కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢల్లీి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఫ్‌ు మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. భాజపానుంచి సుష్మాస్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీలనుంచి సీఎం పదవిని చేపట్టిన 18వ అతివగా రేఖాగుప్తా నిలిచారు.
అదృష్ట ‘రేఖ’.. అలా కలిసొచ్చింది!
కొత్త ఒరవడికి కొనసాగింపుగా ఢిల్లీ సీఎం పదవికి రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది బీజేపీ. దీంతో ఆమె ప్రమాణస్వీకారం చేయడం.. బాధ్యతల స్వీకరణ, తొలి క్యాబినెట్ భేటీ నిర్వహణ వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తొలుత పర్వేశ్ వర్మ, విజేందర్‌గుప్తా వంటి సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. శాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖాగుప్తాను అధిష్ఠానం ఎంపిక చేయడం వ్యూహాత్మకమే. ఈ విషయంలో ఆమెకు సామాజికవర్గంతో పాటు భాజపా నిర్దేశించుకున్న పలు అంశాలు అదృష్టంగా మారాయని చెప్పాలి. ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళా సాధికారత గురించి భాజపా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. ఇదే అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఢల్లీి సీఎం పీఠాన్ని రేఖాగుప్తాకు అప్పగించింది. గతంలో భాజపా నుంచి ఎంఎల్ ఖురానా (పంజాబీ), సాహెబ్ సింగ్ (జాట్), సుష్మా స్వరాజ్ (బ్రాహ్మణ) వంటి నేతలు సీఎంలుగా పనిచేయడంతో.. ఢిల్లీలో బలంగా ఉన్న వైశ్య వర్గానికి ఈసారి ప్రాధాన్యమివ్వాలనే భాజపా అగ్రనాయకత్వం ఉద్దేశం కూడా రేఖకు కలిసొచ్చిన విషయమే. దీనికితోడు భాజపాపాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం రేఖాగుప్తా వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ నేత విజేందర్ గుప్తా సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరిగినా.. భాజపా అగ్రనాయకత్వం నిర్దేశించుకున్న అంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆయనకు స్పీకర్ పదవిని అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. రేఖా గుప్తా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నేత కావడం.. ఆమెలో సంస్థాగత, నాయకత్వ నైపుణ్యాలను అధిష్ఠానం గుర్తించడం, ఢల్లీి వర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షురాలిగా క్యాంపస్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసిన అనుభవం తదితర అంశాలను పరిగనణలోకి తీసుకొని ఆమెకు సీఎంపగ్గాలు అప్పగించినట్టు జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది.