- పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబుతో నేతల భేటీ
- తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చ
- త్వరలోనే 638 మండల, డివిజన్ కమిటీల నియామకం పూర్తికి నిర్ణయం
అమరావతి (చైతన్య రథం): తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయాధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాలనుంచి వచ్చిన నేతలు సుదీర్ఘ కాలం తరువాత సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షునితోపాటు స్టేట్ కమిటీ నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ బలోపేతంలో భాగంగా రెండు మూడు రోజుల్లో 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తరువాత పార్లమెంట్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్టు చంద్రబాబుకు నాయకులు వివరించారు.
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిచేసి నాయకత్వాన్ని అందిస్తే…. గ్రామస్థాయినుంచి జిల్లాస్థాయి వరకు పార్టీలో యాక్టివ్గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం ఆలస్యమయ్యేటట్లు ఉంటే… ఈలోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు… కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్, నన్నూరి నర్సిరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, నందమూరి సుహాసిని, ఆశోక్ గౌడ్, జోత్స్న, వాసిరెడ్డి రామనాధం, పొగాకు జైరామ్ తోపాటు పలువురు హాజరయ్యారు.