కొఠారి కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కారు
ఆస్తులు కొట్టేసే ఉద్దేశంతోనే జి.ఓ నెం.42 విడుదల
సీనియర్ నేతలు కెఎస్ జవహర్, సుజాత, ఎఎస్ రామకృష్ణ
అమరావతి: విద్యలేనివాడు వింతపశువు అని నానుడి ఉంది… ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వాకంతో రాష్ట్రవిద్యారంగం అధోగతిపాలైందని మాజీమంత్రులు కెఎస్ జవహర్, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి విద్యారంగాన్ని లాభాపేక్షతో చూస్తూ వ్యాపారాంశంగా మార్చాడు. టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ ను అధిరోహించిన దళిత విద్యార్థులు నేడు జగన్ రెడ్డి నిర్వాకంతో అమ్మఒడికి చేయిచాచాల్సిన దుస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యతోనే పౌరుల నైతికాభివృద్ధి సాధ్యమని, తద్వారానే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్న అంబేద్కర్ వ్యాఖ్యల్ని జగన్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాలవద్ద నిలబెట్టినప్పుడే ముఖ్యమంత్రికి విద్యారంగంపై ఉన్న చిత్తశుధ్ది ఏమిటనేది తేలిపోయింది. చంద్రబాబుహయాంలో బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తే జగన్ 10శాతంలోపు ఇచ్చి సరిపెట్టాడు. సీపీఎస్ వారంలోరద్దు చేస్తానని జగన్ రెడ్డి 120సార్లుచెప్పాడు. ముఖ్యమంత్రి దృష్టిలో 7రోజులు అంటే 3సంవత్సరాలా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేతలు ఏమన్నారో వారి మాటల్లోనే…!
మాజీమంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ..సమాజగతిని మార్చే విద్యవిషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి లాభాపేక్షకు రాష్ట్రవిద్యారంగం నాశనమైంది. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల్ని లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే జగన్ రెడ్డికి విద్యారంగపై ఉన్న చిత్తశుద్ధేమిటో అర్థమైంది. కరోనా సమయంలో నాడు-నేడు పేరుతో అత్యధిక ఉపాధ్యాయుల మరణానికి ముఖ్యమంత్రి కారకుడయ్యాడు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నాడు? భారతదేశ నిర్మాణం నాలుగ్గోడల మధ్య నిర్మితమవుతోంది అన్న కొఠారి కమిషన్ నిబంధనల అమలుకు ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బందేమిటి? మంత్రులంతా వేలిముద్ర గాళ్లు కాబట్టే రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైంది. చంద్రబాబు హయాంలో బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే జగన్ వచ్చాక తన మూడేళ్లపాలనలో ఎప్పుడూ కూడా 10శాతంలోపే కేటాయింపులు చేశాడు. విద్యకు ముఖ్యమంత్రి అతితక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ముఖ్యమంత్రి పిల్లలే విదేశాల్లో చదవాలా.. దళితులు చదవకూ డదా? విద్యారంగ ప్రగతి, ఉపాధ్యాయ సంక్షేమానికి అన్న నందమూరి తారకరామారావు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు. రీగ్రూపింగ్ స్కేల్స్ విధానంతో ఉపాధ్యాయులకు తహసీల్దార్ తో సమానమైన వేతనం వచ్చేలాచేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. ఐటీ లాంటి ఉద్యోగాలను కూడా కాదని యువత ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నారంటే దానికి కారణం ఆ మహానుభావుడే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిఏటా డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేశారు. గత ప్రభుత్వంలోకూడా 17,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీచేశారు. జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 3వేలపాఠశాలలు మూసేసిందికాక 25వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పాతరేశారని జవహర్ పేర్కొన్నారు.
మాజీమంత్రి పీతల సుజాత మాట్లాడుతూ…
దేశాభివృద్ధికి నిజమైన చిహ్నాలు అద్దాల మేడలు, రంగుల గోడలుకాదు. పౌరుల నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చెప్పారు. నాణ్యమైన విద్యతోనే విద్యార్థులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారన్న వాస్తవాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కువగా చదివేది దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులే. అలాంటి విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం ఆపని చేయకపోగా సజావుగా, సక్రమంగా నడుసున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్ని మూతపడేస్థాయికి తీసుకొచ్చింది. అమ్మఒడి పేరుతో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో అందించకుండా ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. రాష్ట్రంలో 84లక్షల మంది విద్యార్థులుంటే వారిలో కేవలం 40లక్షలమందికి మాత్రమే అమ్మఒడి పేరుతో డబ్బులిస్తూ 44లక్షమందికి తీరనిద్రోహంచేస్తున్నారు. ఏదైనా కుటుంబంలో అమ్మఒడి అందితే అదే ఇంటినుంచి ఉన్నత చదువులు చదివేవారు ఎవరైనా ఉంటే వారికి ఫీజురీయింబర్స్ మెంట్ సాయం ఇవ్వకుండా నిలిపేస్తున్నారు.
నాణ్యమైన విద్యలో 19వస్థానానికి దిగజారిన రాష్ట్రం
నాణ్యమైన విద్యాబోధన అందించే రాష్ట్రాలజాబితాలో దేశంలోనే ఏపీని చంద్రబాబు 3వస్థానంలో నిలిపారు. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాఅని రాష్ట్రం ర్యాంక్ 19వస్థానాని కి పడిపోయింది. ఈ ఒక్కటిచాటు రాష్ట్ర విద్యావ్యవస్థలను ఈ ప్రభుత్వం ఎంతలా దిగజార్చిందో చెప్పడానికి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ,ఎస్టీలకు విద్యనందించే గురుకులపాఠశాలలను జగన్ ప్రభుత్వం బాగా తగ్గించింది. టీడీపీ ప్రభుత్వం విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.10నుంచి రూ.15లక్షలవరకు అందించింది. జగన్ అధికారంలోకి రాగానే దాన్ని పక్కన పెట్టేశాడు. ఆఖరికి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కూడా నిలిపేశాడు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలన్నింటినీ ప్రభుత్వం మూసేసింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన, మేలైన విద్య అందకూడదన్నదే వైసీపీ ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా మారింది. ఇలాంటి కుటిల ఆలోచనల్ని ప్రభుత్వం మానుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు పేదలకు అందాలని, అంటరాని తనాన్ని రూపుమాపేందుకు విద్యాభ్యాసం చాలాముఖ్యమైనదని భావించారు. కానీ ఈప్రభుత్వం ఆయన ఆలోచనలకు పూర్తివిరుద్ధంగా వ్యవహరిస్తోందని పీతల సుజాత దుయ్యబట్టారు.
మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. 2019లో ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తానని జగన్ 120సార్లు చెప్పా డు. ముఖ్యమంత్రి లెక్కలో 7రోజులు అంటే 3 సంవత్సరాలా? ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఓట్లుకొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి, సీపీఎస్ రద్దు చాలాలోతైంది అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్అని ముఖ్యమంత్రి అనడం ముమ్మాటికీ ఆయన చేతగానితనమే. మేనిఫెస్టో గురించి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి, ఎన్ని హామీలు నెరవేర్చాడు. ప్రతి తల్లీతండ్రీ వారి పిల్లలకు నాణ్యమైన విద్యకావాలనే ఆశ ఉంటుంది. వారిఆశల్ని వమ్ముచేస్తూ పిల్లలు లేరన్నసాకుతో 418 ఎయిడెడ్ పాఠశాల లకు జగన్ రెడ్డి మంగళం పాడాడు. స్కూల్ మ్యాపింగ్ పేరుతో 3, 4, 5 తరగతుల్ని హైస్కూళ్లలో కలపడం, 1, 2 తరగతుల్ని అంగన్ వాడీల్లో కలపడమనేది దేనికోసం చేశారు? జగన్ రెడ్డి ప్రభుత్వపాఠశాలల్ని మూసేస్తూ ప్రైవేట్ పాఠశాలల్ని ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు రేషనలైజేషన్ కింద ఒకరిద్దరు విద్యార్థులుండే పాఠశాలల్ని అందుబాటులో ఉండే ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలన్నారు. అంతేగానీ పూర్తిగా వాటినిలేకుండా చేయమనలేదు. దానికే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోఉన్నప్పుడు కాకిగోల చేశాడు. ఇప్పడు ముఖ్యమంత్రి అయ్యాక అసలు గ్రామాల్లో ఎక్కడా ప్రభుత్వపాఠశాలే ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నాడు. విలీనంపేరుతో అధికారులతో తప్పుడు లెక్కలు చెప్పించిన ముఖ్యమంత్రి 3కిలోమీటర్ల లోపుండే 9,773 పాఠశాలల్నిరద్దుచేశాడు. చిన్నచిన్న పిల్లలునడిచి 3కిలోమీటర్లదూరంలో ఉండే పాఠశాలకు వెళ్లగలరా అన్నఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకురాలేదు? ప్రాథమిక పాఠశాలలన్నీ విద్యార్థులకు వాకబుల్ డిస్టేన్స్ లో నే ఉండాలని కొఠారి కమిషన్ తననివేదికలో చాలాస్పష్టంగాచెప్పింది. కానీ ముఖ్యమంత్రి ఆ నిబంధనను, కొఠారి కమిషన్ నివేదికనే తుంగలో తొక్కాడు.
ఆస్తులు కొట్టేసే ఆలోచనతోనే జిఓ 42!
ఏసీ (ఆంధ్రా క్రిస్టియన్ ), లయోలాకళాశాల, సిద్ధార్థ కళాశాల లాంటి ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొట్టేయా లన్న దురాలోచనతోనే ముఖ్యమంత్రి జీవోనెం-42 తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉద్యమించినా ముఖ్యమంత్రి నేటికీ ఆసమస్య పరిష్కరించలేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల్ని తాకట్టుపెట్టాలని చూస్తోంది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల్ని పర్మినెంట్ చేస్తానన్న హామీని కూడా జగన్ విస్మరించాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాన్ని రూ.18వేలనుంచి రూ.37వేలకు పెంచి నెలనెలా క్రమంతప్పకుండా చెల్లించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి హీనంగా తయారైంది. ఓట్లకోసమే ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని ముఖ్యమంత్రి నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తున్నాడు. 40శాతం కళాశాలలు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు తమకు అందడంలేదని కోర్టుకువెళ్లాయి. దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధా నం చెబుతారని ఎఎస్ రామకృష్ణ ప్రశ్నించారు.