- విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ప్రాథమిక సమస్యలపై దృష్టి
- మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై అభిప్రాయసేకరణ
- పాఠశాల విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
ఉండవల్లి (చైతన్య రథం): జగన్రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యాప్రమాణాలు దారుణంగా దిగజారాయనడానికి జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికే నిదర్శమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పాఠశాల విద్యపై ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించిన మంత్రి.. అసర్ నివేదికపై ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ఫ్యాన్సీ కార్యక్రమాలు కాకుండా ప్రాథమిక సమస్యలైన ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కనీస అభ్యాసన సామర్థ్యాల మదింపునకు తరగతి ఉపాధ్యాయులతో చర్చించాలని, వెనుకబడిన విద్యార్థులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపైనా సమావేశంలో చర్చించారు. ఐవీఆర్ఎస్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. బాలికల స్వీయరక్షణ తర్ఫీదు కోసం శిక్షకులను నియమించాలని ఆదేశించారు. విద్యారంగంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపైనా సమావేశంలో చర్చించారు. ప్రతి పాఠశాలలోని లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగపర్చుకునేలా ఉండవలసిన పుస్తకాలను ఆయా రంగాల నిపుణులతో చర్చించి పాఠశాల లైబ్రరీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులు వినియోగించుకునే తీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులు, పీఈటీల అభీష్టం మేరకు పాఠశాలల్లో క్రీడా సామాగ్రిని సమకూర్చాలని, పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల ప్రభావాన్ని విశ్లేషించాలన్నారు. టెన్త్, ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో విద్యార్థుల డ్రాపవుట్స్ పైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యా విధ్వంసం బట్టబయలైంది..
‘ప్రచారానికి మేనమామ.. వాస్తవంలో కంసమామ’ అని జగన్ భ్రష్టపాలన అసర్ నివేదికతో మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదన్నారు. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గావున్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదిక కళ్లకు కట్టిందన్నారు. అడ్డగోలు జీవోలు తెచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు.. తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లులాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం.. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగంమంది రెండో తరగతి పాఠ్య పుస్తకాలు చదవలేని పరిస్థితిని గణాంకాలు సహా అసర్ నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టి.. విద్యా ప్రమాణాల పెంపునకు గత ఏడు నెలల్లో గణనీయమైన చర్యలు తీసుకున్నామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించార. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారన్న పక్కా లెక్కలు తీయడం దగ్గర మొదలుపెట్టి.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్య, విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించేలా గైడెన్స్ ఇవ్వడం, కనీస మౌలికవసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకూ అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నట్టు లోకేష్ వెల్లడిరచారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ‘ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ రూపొందించి.. ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకోనున్నట్టు ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.