.మంత్రి గుమ్మనూరు జయరాం జోక్యం
.కమిషనర్, జాయింట్ కమిషనర్ ఒకే రోజు వేర్వేరు ఉత్తర్వులు
.విచారణ కోరుతూ సీఎస్‌కు టీడీపీ ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య లేఖ
అమరావతి: గుంటూరు కార్మికశాఖ జోన్-3లో జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు. బదిలీల విషయంలో కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశాలను లేబర్ కమీషనర్ కార్తికేయ మిశ్రా తిరస్కరించినట్లు తెలిపారు. అయితే, లేబర్ కమీషనర్ బదిలీల ఉత్తర్వులు పక్కన పెట్టి మంత్రి గుమ్మనూరు జయరాం ఒత్తిడి మేరకు గుంటూరు జోన్-3 జాయింట్ కమిషనర్ కూడా బదిలీలు చేశారన్నారు. లేబర్ కమీషనర్, జాయింట్ కమీషనర్ ఒకే రోజు వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇది సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆ లేఖలో తెలిపారు. బదిలీల్లో అక్రమాలకు పాల్పడి ఎంతో మంది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల వద్ద రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కార్మికశాఖ బదిలీలపై వచ్చిన అవినీతి ఆరోపణలు, మంత్రి జోక్యం పై, జాయింట్ కమిషనర్ క్రమశిక్షణా రాహిత్యంపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.