కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం రూ.3,826 కోట్లు పంట రుణాలుగా మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది రైతులకు గొప్ప ఊరటను కలిగిస్తోంది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేశాడు. అంతేకాక బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కౌలు రైతులకు ఇవ్వవలసిన రూ.2000 కోట్ల రుణాలు కూడా ఇవ్వలేదు. బడుగు బలహీన వర్గాలలో ఉన్న కౌలు రైతులను మోసం చేయాలనే దురుద్దేశంతోనే కుట్ర పన్ని వారికి బ్యాంకుల నుండి రుణాలు రాకుండా చేశాడు. రాష్ట్రంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కౌలు రైతులుగా ఉన్నారు.
టీడీపీ హయాంలోనే..
కౌలు రైతుల కోసం టీడీపీ ప్రభుత్వం 2016లో కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. కౌలు రైతులకు సీసీఆర్సీ (పంటహక్కు సాగుదారు పత్రం) కార్డు ఇస్తారు. సీసీఆర్సీ కార్డ్ ఉన్న రైతులకు రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ లాంటివి అన్నీ అందుతాయి. ఈ చట్టం ద్వారా 2019 వరకు కౌలు రైతులు తమ దగ్గర ఉన్న అర్హత పత్రాలతో నేరుగానే నష్ట పరిహారం, రుణం పొందేవారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దాదాపు 8 లక్షలమంది కౌలు రైతులను గుర్తిస్తే, జగన్ ప్రభుత్వం కౌలు రైతులను 1,53,123 సంఖ్యకు కుదించింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వటానికి చేతులు రాలేదు. భూమి యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు పత్రం (సీసీఆర్‌సీ) ఇవ్వాలని ఆదేశించడం కౌలు రైతు పాలిట మరణశాసనమైంది.
కౌలు రైతుల చట్టాన్ని నీరుగార్చిన జగన్‌రెడ్డి
2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో కౌలు రైతు చట్టాన్ని నీరుగార్చారు. టీడీపీ హయాంలో ఉన్న కౌలు రైతు చట్టాన్ని రద్దు చేస్తూ 2019 సెప్టెంబర్ 23న జీఓ 410 పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ చట్ట ప్రకారం ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారంతా భూమి యజమానుల నుంచి కౌలు ఒప్పంద పత్రాలు పొందాలి. అలాంటి వారికే రుణ అర్హత అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్దేశించింది. ఈ సవరణతో కౌలు రైతుల రూపే మారింది. భూమి యజమానులు కౌలు ఒప్పంద ప్రతాలను జారీ చేయకపోవడంవల్ల లక్షలమంది కౌలు రైతులు నష్టపోయారు. దీనివల్ల విపత్తు సమయాల్లో పంట నష్టపరిహారం భూమి యజమానుల ఖాతాల్లోనే జమయ్యింది. ఆఖరుకి ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల సబ్సిడీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయమే జరిగింది.
కౌలు రైతుల ఆత్మహత్యలు
కౌలు రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందంటే జగన్‌రెడ్డి చేసిన పాలన.. అతడి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. జగన్‌రెడ్డి సర్కారు కౌలు రైతులను నమ్మించి మోసం చేసింది. ఇష్టానుసారంగా హామీలిచ్చి వాటిని అమలు చేయకపోవడం వల్లనే కౌలు రైతులు దారుణంగా చనిపోయారు.
కౌలు రైతుల ఆర్థిక వృద్ధికి కీలక నిర్ణయం
కౌలు రైతులు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవడానికి సరైన బ్యాంకింగ్ సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. అందుకే చంద్రన్న ప్రభుత్వం ఈ సమస్యను అర్థం చేసుకొని రూ.3,826 కోట్ల రుణాన్ని మంజూరు చేయించడం ద్వారా కౌలు రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా చేసింది.
సంక్షేమం దిశగా చర్యలు
చంద్రబాబు పాలనలో 2024`25లో 9 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీ చేసింది. వీటి ద్వారా పంట రుణాలు, నిర్దుష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులని తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతుల సంక్షేమం దిశగా చర్యలు చేపట్టంది. ఇందులో భాగంగా కౌలు రైతులకు వ్యవసాయ రుణంగా రూ.4 వేల కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కూటమి పాలనలో వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధి
2014-19 మధ్య టీడీపీ హయాంలో వ్యవసాయంలో 16.6శాతం వృద్ధి నమోదైంది. 2019-24మధ్య జగన్‌రెడ్డి ప్రభుత్వంలో అది 10.22శాతానికి పడిపోయింది. చంద్రబాబు పాలనలో వ్యవసాయం వృద్ధిరేటు తాజా గణాంకాల ప్రకారం 2024-25లో వ్యవసాయంలో 15.86శాతం వృద్ధి నమోదైంది.
రైతు బాంధవుడు చంద్రన్న
ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన కౌలు రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ఖరీఫ్ 2024లో ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న 24,239 మంది కౌలు రైతులకు రూ. 31,36,54,043 కోట్లు విడుదల చేసి రైతు బాంధవుడు చంద్రన్న అని నిరూపించుకున్నారు.
ధాన్యం కొనుగోలుపై హర్షం
రాష్ట్రంలో 5,18,268 మంది రైతుల నుంచి 32,58,084 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు రూ.7,504.27 కోట్లు ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేసింది. జగన్‌రెడ్డి ప్రభుత్వం.. రబీ సీజన్‌లో 1.32 లక్షల మంది రైతుల నుంచి రూ.2,767.90 కోట్ల విలువైన 12.63 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్మును చెల్లించకుండా నానా యాతనలకు గురిచేశాడు. చెప్పులు అరిగేలా రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగి తిండి తిప్పలు లేక రైతులు నరకం చూశారు. అంతేకాక 84,724 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.1674.47 కోట్ల ధాన్యం బకాయిలను జగన్‌రెడ్డి ఎగొట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 2023`24 ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బకాయిలను రూ.1674.47 కోట్లు విడుదల చేసింది.
అభివృద్ధి వైపుగా బాటలు
జగన్ ప్రభుత్వం కౌలు రైతులకు పూర్తిగా అన్యాయం చేసి, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు రుణాలు, మద్దతు ధర, సహాయ నిధులు అందుతుండగా, జగన్ హయాంలో ఇవన్నీ అదృశ్యమయ్యాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి, రైతులకు పూర్తి మద్దతుగా ఉంటూ, కౌలు రైతులకు రుణాలు అందిస్తూ.. ‘రైతు రాజ్యం `పరిశ్రమల ప్రగతి’’ లక్ష్యంగా చేపడుతున్న చర్యలు ఆర్థికవృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది!
`టి నిర్మలాజ్యోతి, అనలిస్టు