డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చి.. పాలనకు సాంకేతిక అనుసంధానంతో ప్రజలకు సత్వర సేవలందించడమే లక్ష్యంగా అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు ఆశయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారు. ప్రతి పౌరుడు తన విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకొనేలా కూటమి ప్రభుత్వం మెరుగైన పౌర సేవలు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం అభినందనీయం. కాలు కదపకుండా, కాలయాపన లేకుండా, కాగితం అక్కరలేకుండా, కార్యాలయాలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే అవసరం లేకుండా సేవలు అందించడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో దేశంలోనే ముందుండే సీపం చంద్రబాబు కలల రూపమే వాట్సాప్ గవర్నెన్స్! ప్రతి పౌరుడి చేతిలో ఉండే మొబైల్ ఫోన్‌నే పాశుపతాస్త్రంగా మార్చారు ఐటీ మంత్రి లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్‌తో పౌర సేవల స్వరూపమే మారిపోనున్నది. పారదర్శక పాలనను హక్కుగా పొందేందుకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వెయ్యాలని మంత్రి లోకేష్ నిర్ణయించడం అభినందనీయం. ఇండియాలో వాట్సాప్ పాలన ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాట్సాప్ ద్వారా 160 పౌర సేవలను అందించే విశిష్ట పథకం ఏపీలో ఆరంభమైంది. ప్రజలకు మెరుగైన సేవలు అందడంతోపాటు సమయం, డబ్బు ఆదా కావాలంటే వాట్సాప్ గవర్నెన్స్ ఉత్తమమని ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందే వాట్సాప్ గవర్నెన్స్!
రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ‘మన మిత్ర’ ప్రజల చేతిలో ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన.. నినాదంతో వాట్సాప్ సేవలను ప్రారంభించారు ఐటీ మంత్రి నారా లోకేష్. ఇకనుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ 9552300009 నెంబర్ ద్వారా వాట్సాప్‌లో ఉచితంగా పొందవచ్చు. వాట్సాప్ ద్వారా అందించే సేవల్లో 80శాతం రియల్‌టైం గవర్నెన్స్‌లో పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వం- ప్రజలమధ్య వారధి వాట్సాప్ గవర్నెన్స్ కానుంది. మొదటి విడతలో 161 సేవలను అందించనుండగా, భవిష్యత్తులో 500పైగా ప్రభుత్వ సేవలకు విస్తరించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నాక్యాంటీన్, సీఎంఆర్‌ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందించనున్నారు. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామం. కుల ధ్రువీకరణ పత్రాల నుంచి విద్యార్హత సర్టిఫికెట్ల వరకు వాట్సాప్ ద్వారా సులువుగా పొందవచ్చు. ప్రజా సమస్యలను కూడా వాట్సాప్ నెంబర్‌కు తెలపవచ్చు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖలు స్పందించి పరిష్కరించనున్నాయి. విద్యార్థులకు ఇచ్చే విద్యార్హత సర్టిఫికెట్లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్‌సైట్‌కు ఆ లింక్ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారముండదు. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలోని ప్రధాన దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవలను అందించనున్నారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించడం అభినందనీయం.
సర్టిఫికెట్లు, ధృవపత్రాలు, పన్ను చెల్లింపులువంటి అనేక రకాల పౌర సేవలు ఆన్‌లైన్ వ్యవస్థతో ముడిపడి వుంటాయి. వీటిని పొందేందుకు లంచాలు, అవినీతి, దళారుల ప్రమేయం తగ్గనున్నది. అట్లాగే ప్రభుత్వం సత్వర సేవలు పొందేందుకు అవసరమైన సాంకేతిక అంశాలపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరముంది. ప్రజలు కూడా అవగాహన పెంచుకుంటూ వాట్సాప్ సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలి. ఏదేమైనా ఇంతటి బృహత్తర పథకం కసరత్తును స్వల్ప వ్యవధిలో మొదలు పెట్టడం ఐటీ మంత్రిగా లోకేష్‌కే సాధ్యమైంది.
2014-2019 మధ్యలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగావున్న లోకేష్ ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ఇండియా’ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును న్యూఢల్లీిలో జరిగిన బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్‌లో అందుకున్నారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరు మెరుగుపరిచినందుకు లోకేష్‌కు ఆ అవార్డు దక్కింది. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగాలలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో.. దృఢమైన కార్యాచరణతో ఐటీ అభివృద్ధికి మంత్రిగా లోకేష్ విశేష కృషి చేస్తున్నారు. సాంకేతికాంధ్రని దేశానికి దిక్సుచి చెయ్యాలన్న చంద్రబాబు స్వప్నాన్ని సాకారం చెయ్యడానికి నిరంతరం శ్రమిస్తున్నారు.
నీరుకొండ ప్రసాద్