ముంబయి (చైతన్యరథం): ఏపీలో బ్లూ స్టార్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థ అధినేతను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. బ్లూస్టార్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) విర్ అద్వానీతో మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబయిలో భేటీ అయ్యారు. ఎయిర్ కండీషనింగ్ సొల్యూషన్స్ (రెసిడెన్షియల్, కమర్షియల్), కమర్షియల్ రిఫ్రిజిరేషన్, కోల్డ్ చైన్, ఎంఈపీ కాంట్రాక్టింగ్ (Mechanical, Electrical, Plumbing, Fire-fighting), ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, వాటర్ ప్యూరిఫయర్లు, ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీలో పేరెన్నికగన్న బ్లూస్టార్ ລ້… 2024-25 సంవత్సరంలో రూ.11,977 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారత్లో 2వ అతిపెద్ద హెమ్ గ్రోన్ ఏసీ కంపెనీగా అవతరించిన బ్లూస్టార్… 2 మిలియన్ రూమ్ ఏసీల తయారీ సామర్థ్యంతో పనిచేస్తోంది.
ఈ సందర్భంగా విర్ అద్వానీతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… బ్లూస్టార్ సంస్థ తిరుపతి శ్రీసిటీలో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రూ.900కోట్లతో చేపట్టిన విస్తరణ ప్రణాళిక 2026 నాటికే పూర్తిసామర్థ్యంతో పనిచేసేలా పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏపీలోని ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఆర్ అండ్ డీ కేంద్రం స్థాపనను ప్రోత్సహిస్తుంది. దేశంలో బ్లూ స్టార్ ఏకైక ఆర్ అండ్ డీ కేంద్రం ముంబైలో పనిచేస్తోంది. దక్షిణ భారతదేశంలో బ్లూ స్టార్ మొదటి ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న IT&GCC పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్లోబల్ ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. డేటా సెంటర్ కూలింగ్ సొల్యూషన్లపై ఏపీ ప్రభుత్వంతో బ్లూ స్టార్ లిమిటెడ్ సంస్థ కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.