దావోస్ (చైతన్యరథం): ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ (ఆర్‌ఈ ) పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ఎన్విజన్ సీఈఓ లీ జంగ్ ను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. సీఈఓ లీ జంగ్ తో దావోస్ బెల్వేడేర్ లో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పగతిశీల ఆలోచనలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు. ప్రస్తుతం 11 గిగావాట్లుగా ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని 2030 నాటికి భారీగా పెంచాలన్నది మా లక్ష్యం. ఇది మొత్తం దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో 32శాతంగా ఉంది. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ `2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తుంది. రెన్యవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుచేసి, ప్రోత్సాహక ప్రయోజనాలను అందిపుచ్చుకోండి. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్ లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్‌ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు.
దీనిపై ఎన్విజన్ సీఈఓ లీ జంగ్ మాట్లాడుతూ…. 2023-24లో 5 గిగావాట్ల ఆర్డర్లతో భారత్‌లో ఎన్విజన్ అగ్రగామి విండ్ టర్భైన్ సరఫరాదారుగా నిలచిందని చెప్పారు. భారతదేశంలో 3 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో పూణే లోని నాసెల్లె లో, బ్లేడ్లల కోసం త్రిచిలో రూ.500 కోట్లతో అత్యాధునిక తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేశాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నాం. ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.