- ప్రతీ ఇంటా చిరువ్యాపారమో.. చిన్న పరిశ్రమో స్థాపించేలా ప్రణాళిక
- స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోకూ విస్తరిస్తామని స్పష్టీకరణ
- కల్తీ మద్యాన్ని గుర్తించేలా త్వరలో మొబైల్ యాప్
- పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యానికి మోకాలడ్డుతున్నారు
- వైసీపీ దుష్పచారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
అమరావతి (చైతన్య రథం): ప్రతీ కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ విధానంలో భాగంగా ప్రతీ ఇంటా చిరు వ్యాపారమో చిరు పరిశ్రమో స్థాపించేలా పని చేస్తున్నామన్నారు. శనివారం నెల్లూరులోని మైపాడు గేట్వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చ్యువల్గా ప్రారంభించారు. రూ.7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 దుకాణాలను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది. వీటిని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారులైన దుకాణదారులతో మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్లో దుకాణాలు పొందిన 120మంది ఇప్పుడు వ్యాపారవేత్తలయ్యారు. 18 ఏళ్లకుపైగా వీధి వ్యాపారాలు చేసి ఇప్పుడు అత్యాధునిక దుకాణాలుపొంది వ్యాపారాలు చేస్తున్న అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు ఈ దుకాణాలను అత్యంత పారదర్శకంగా కేటాయించాం. గతంలో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వ్యాపారాలు చేసుకునే స్థితినుంచి ఇప్పుడు అత్యాధునిక దుకాణాల ద్వారా వ్యాపారం చేసుకునే సౌలభ్యం కలిగించాం. కొనుగోలుదారులకు అన్ని వస్తువులూ ఒకేచోట లభించేలా ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాంతం ఏర్పాటైంది. ఎవరైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడికీ వెళ్లకుండా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేయటం అభినందనీయం. రూఫ్ టాప్ సీటింగ్, వైఫైలాంటి ఏర్పాట్లు చేయటం సంతోషంగా ఉంది. ఈ వినూత్న ప్రయత్నం చేసిన మంత్రి నారాయణ, పురపాలక శాఖ, మెప్మా అధికారులను అభినందిస్తున్నాను. ఈ తరహా వినూత్న ఆలోచనలు, ప్రయత్నాలు మరిన్ని జరగాలి అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు
కూటమి ప్రభుత్వం పేదలు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ద్వారా నెల్లూరుకు ముందుగానే దీపావళి వచ్చిందని.. ఈ వెలుగులు శాశ్వతం చేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ఆధునిక దుకాణాలను ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నెల్లూరు మైపాడు గేట్పద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుచేసి తొలిసారి మంచి ప్రయోగం చేశామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. 120మంది చిన్న పారిశ్రామికవేత్తలుగా మొదటి అడుగు వేశారని.. మీరు మరింతగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. రాష్ట్రంలో డ్వాక్రా, మెప్మా సంఘాలకు చెందిన లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
వీధి వ్యాపారాలు చేసే మాకు శాశ్వత దుకాణాలు: మహిళా లబ్దిదారులు
నెల్లూరు మైపాడుగేట్ లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లో దుకాణాలు దక్కించుకున్న మహిళలు అమితానందాన్ని వ్యక్తం చేశారు. మహిళా వ్యాపారులతో ముఖ్యమంత్రి అమరావతి నుంచి వర్చువల్గా మాట్లాడి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ దుకాణాలు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయన్న అంశాలను వారి నుంచే అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీధి వ్యాపారాలకు సైతం కిరాయి చెల్లించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ దుకాణలు ఇచ్చి ఆదుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపిందని లబ్దిదారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం పేదలు, మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకే ప్రభుత్వం కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లో దుకాణాలు పొందిన మహిళా వ్యాపారులు వాటి హక్కు పత్రాలను చేతుల్లో పట్టుకుని ముఖ్యమంత్రికి చూపించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా నిత్యావసరాలతో పాటు వివిధ వస్తువుల ధరలు తగ్గాయని రెండు శ్లాబ్లతో ప్రజలపై భారం తగ్గిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈనెల 16న ప్రధాని మోదీ కూడా కర్నూలుకు వచ్చి ఈ అంశాలను ప్రజలకు వివరిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.
కల్తీ మద్యం గుర్తించేందుకు కొత్త యాప్
గత పాలనలో మద్యం విధానంలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఎం అన్నారు. గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు తీసి ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఎవరు నకిలీ మద్యం తయారుచేసినా, విక్రయించినా వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం హెచ్చరించారు. ఇటీవల ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేసిన వారిని పట్టుకుని కేసులు పెట్టామని ..ఈ వ్యవహారంలో టీడీపీ వారున్నా ఉపేక్షించకుండా అరెస్టు చేసి కఠినంగా వ్యవహరించామని అన్నారు. కొందరు దీనిని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తండ్రి చనిపోతే డ్రామాలాడారని.. బాబాయిని చంపేసి మాపై దుష్ప్రచారం చేయడం చూశామని వ్యాఖ్యానించారు. నెల్లూరులో సాధారణ మరణాన్ని కూడా మద్యం తాగి చనిపోయారంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలోనే ప్రభుత్వం ఓ యాప్ ను తీసుకురానుందని సీఎం ప్రకటించారు. అనుమానం ఉన్న ఎవరైనా మద్యం బాటిల్పై ఉన్న హెలో గ్రామ్ స్కాన్ చేస్తే వివరాలు తెలుసుకునేలా యాప్ రూపొందిస్తున్నట్టు వివరించారు.
నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి అభ్యంతరం ఏమిటి?
పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి వచ్చిన అభ్యంతరం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పీపీపీలో నిర్మించే వైద్య కళాశాలల్లో నాణ్యమైన వైద్య సేవలతోపాటు 110 మెడికల్ సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు వారికి అనారోగ్యం కలిగితే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళు _న్నారని.. కానీ పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన వైద్యం వద్దా అని నిలదీశారు. తాను ఏ పనిచేసినా పేదలను దృష్టిలో ఉంచుకునే చేస్తానని, మంచి విద్య, వైద్యంతోపాటు ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. గత పాలకులు అనుసరించిన విధానంతో ఆస్పత్రులు కడితే కనీసం 20 ఏళ్లు పడుతుందని అప్పటి వరకూ పేదలు ఇబ్బందులు పడాలా? అని సీఎం ప్రశ్నించారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయన్నారు. యజ్ఞంలా చేస్తున్న మంచి కార్యక్రమాలకు విఘ్నాలు కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నెల్లూరులో కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులతో పాటు దగదర్తి ఎయిర్ పోర్టు, బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వానికి వారి సహకారం అవసరం అని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమంలో పురపాలక మంత్రి పి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా సహా నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.