అనర్హత వేటునుంచి తప్పించుకోడానికి.. అటెండెన్సు కోసం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేసి, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయాడు జగన్. ఎమ్మెల్యేలు, అధికారం ఎప్పుడూ అతని చేతుల్లోనే ఉండాలన్న గొంతెమ్మ కోరిక జగన్‌ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాసన సభ్యులుగా ప్రమాణం చెయ్యడానికి ఒకసారి, గవర్నర్ ప్రసంగ సమయంలో ఒకసారి అసెంబ్లీకి వచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్! తర్వాత జరిగిన అసెంబ్లీకి రాలేదు. తాజాగా తమకు ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు. కూటమి నేతలు, స్పీకర్ సంఖ్యాబలంతోనే ప్రతిపక్ష హోదా వస్తుందని పదే పదే చెబుతున్నా.. జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ మొండిగా వాదిస్తున్నాడు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు అకారణంగా, సమాచారమివ్వకుండా సభకు రాకపోతే సభ్యుల సభ్యతం రద్దవుతుందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధికారికంగా ప్రకటించడంతో..
దిక్కుతోచక భయంతో అసెంబ్లీకి అటెండెన్స్ కోసం వచ్చారు తప్ప మరేమీ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సభ్యుల సభ్యత్వం రద్దయి.. ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్నది గ్రహించలేనంత దద్దమ్మలైతే కాదు వైసీపీ. అది గ్రహించబట్టే తన ఎమ్మెల్యేలతో అటెండెన్సు కోసం అసెంబ్లీకి వచ్చారు తప్ప ప్రజల కోసమైతే కాదు. జనమివ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చెయ్యడం జగన్ అసంబద్ధ ఆలోచనకు తార్కాణం. ప్రతి విషయం జగన్ చెప్పినట్టే జరగాలనుకోవడం ఇదేమైనా రాచరికమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడండంటూ నినాదాలు చేశారు. మీ హోదాకోసం అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటమా? ఐదేళ్లు ప్రజాస్వామ్య వస్త్రాపహరణ చేసిన జగన్‌రెడ్డి.. నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు కాదా. తనకోసం తప్ప సామాన్య జనం కోసం జగన్ ఎప్పుడూ ఆలోచించరని మరోసారి రుజువైంది. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా సంప్రదాయానికి భిన్నంగా ప్రతిపక్ష నేత హోదా కోసం చెప్పే సాకులన్నీ జగన్‌రెడ్డి కోసమే తప్ప జనం కోసమైతే కానే కాదు.
ప్రతిపక్ష హోదా ఇవాల్సింది స్పీకర్ కాదు, ప్రజలు. సభలో పార్టీల సభ్యుల సంఖ్యాబలం ప్రకారమే ప్రతిపక్ష హోదా లభిస్తుందని తెలిసీ జగన్నాటకాలు ఆడుతున్నాడు జగన్. మరో నలుగురు తెలుగుదేశం సభ్యులను గుంజుకొంటే ప్రతిపక్ష హోదా కూడా ఊడుతుందని గతంలో జగన్ అనలేదా? అధికారం ఉంటే ఒకలా, లేకపోతె మరోలా మాట్లాడటం జగన్ నైజం. వైసీపీ జమానాలో అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే తెలుగుదేశం సభ్యులకు సభలో సమయం కేటాయించిన విషయం గుర్తులేదా? ఇప్పుడు సభ్యులతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సభలో సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాదెందుకు సమయం ఇవ్వాలని కోరడం ఇదేం పద్ధతి? ప్రతిపక్ష హోదా కోసం చేసే రాద్దాంతమంతా మీ హోదా కోసమే తప్ప జనం కోసమా? అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాదిలా బాధ్యత లేకుండా పాలనచేసిన జగన్‌రెడ్డికి, ప్రతిపక్ష హోదా కూడా అక్కరలేదని ప్రజలు చిత్తుగా ఓడిరచి 11 సీట్లకే పరిమితం చేశారు. ఎన్నికల ప్రచారంలో తన పాలన నచ్చితేనే నాకు ఓట్లు వెయ్యమని ఓటర్లను కోరిన విషయం గుర్తు లేదా?. మీ పాలన నచ్చకనేకదా.. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు.
కౌల్ అండ్ షక్దర్ రూల్స్ పుస్తకంలో కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి పదిశాతం సభ్యులు ఉండాల్సిందేనని చెబుతున్నది. కానీ జగన్‌కి ప్రతిపక్ష హోదా దక్కాలంటే పదిశాతం సీట్లు అంటే, 18మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. మరి జగన్ సహా 11మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. జగన్ తన స్వప్రయోజనాల కోసమే శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని పట్టుబడుతున్నారు. సభలో ప్రజా సమస్యలు లేవనెత్తాలంటే ప్రతిపక్ష హోదానే అక్కరలేదు, ఎమ్మెల్యే అయినా చాలు. కానీ జగన్ తన స్వార్థం కోసం, క్యాబినెట్ ర్యాంక్ మంత్రికి సమానమైన పదవి కోసం, ప్రతిపక్షనేత హోదాలో తన దర్పం వెలగపెట్టడం కోసం పాకులాడుతున్నాడు తప్ప ప్రజల కోసం మాత్రం కాదు. ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆయన ప్రతిపక్ష హోదా రాద్ధాంతం చేస్తున్నాడు.
ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసం నుండే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాననడం సిగ్గుచేటు. అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు అధికారికంగా రికార్డు అవుతాయన్న విషయం మరచి తన నివాసం నుండే ప్రశ్నిస్థానడంమంటే ఆయనకి అసెంబ్లీ పట్ల ఎంత భాధ్యత వుందో అర్ధం అవుతుంది.
నిజంగా ప్రజా సమస్యలపట్ల బాధ్యతవుంటే ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండానే సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన నిలబడి పోరాటం చెయ్యడం ఆయన బాధ్యత. ఆ బాధ్యతనుంచి తప్పుకుని సమావేశాలు బహిష్కరించడమంటే అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక పారిపోవడమే అవుతుంది. నిజంగా జగన్ ప్రజాహితం కోరితే ఈ విధంగా వ్యవహరించరు. ప్రజాసమస్యలను ప్రశ్నించడానికి అసెంబ్లీకి వెళ్లనప్పుడు ఎమ్మెల్యేలుగా వుండటానికి, జీతం, మరియు ఇతర అలవెన్సులు పొందడానికి అనర్హులు? ప్రజలు ఎన్నుకున్న చట్టసభ ప్రతినిధులుగా సభకు వెళ్లాలి. తమ అభిప్రాయం చెప్పాలి. సభను గౌరవించే లక్షణం లేనప్పుడు సభ్యులుగా కొనసాగడం ఎందుకు? అసెంబ్లీకి హాజరై ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడమే ఎమ్మెల్యేల పని. అంతే తప్ప రాజ్యాంగంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా వేరే పనులు కేటాయించలేదు. గత ఐదేళ్లు అసెంబ్లీని జగన్ తన జాగీరుగా భావించి సభలో సమస్యలపై చర్చలకు పట్టుపట్టిన ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులను నిత్యం సస్పెండ్ చేసి సభాకార్యక్రమాలు జరిపించారు. చర్చలు లేకుండానే చట్టాలు రూపొందించారు.
సభలో ప్రతిపక్షం మాట్లాడటానికి కూడా కనీసం మైకు ఇవ్వకుండా వారి ప్రాథమిక హక్కుని కాలరాసారు. రాజ్యం వీరభోజ్యం అన్నట్టు మందబలంతో సభా మర్యాదలు మంటగలిపారు. శాసనసభలో మంత్రులు, శాసన సభ్యులు వాడిన భాష శాసన సభ ప్రతిష్టనే మసక బార్చింది. చేసిన పాపాలకు మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు చేతిలో పెట్టి అధికారంలోంచి తరిమెయ్యడంతో చిన్న పిల్లలు చాకెట్ల కోసం ఏడ్చినట్టు.. జనమివ్వని ప్రతిపక్ష హోదాకోసం తెగ గింజుకొంటూ.. హోదా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకొంటూ.. అసెంబ్లీని బహిష్కరించడం అంటే ప్రజాస్వామ్యానికి తలకొరివి పెట్టడమే అవుతుంది.
`నీరుకొండ ప్రసాద్