నరసరావుపేట: వైసీపీ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలకు నిరసనగా, వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన కోసం టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్.రాజు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న దళిత గర్జన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న దళిత గర్జనకు టీడీపీ నాయకులతో కలసి పయనమైన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద బాబు, దళిత నాయకులను టీడీపీ కార్యాలయం వద్ద ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై దాడులు నిత్వకృత్యమయ్యాయి అన్నారు. ఎప్పుడు లేని విధంగా పల్నాడు జిల్లాలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో విష సంస్కృతిని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. దళితుల కోసం కేటాయించిన వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులను వైసీపీ పాలకులు దారి మళ్లించారని తిరిగి ఆనిధులన్నింటినీ రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలు, శ్యామ్, చిన్న, మధు, ఏసుబాబు, చిన్న, రమేష్, రవి, బుడ్డయ్య, కోటేశ్వరరావు, మరియబాబు, దావీదు, కాంతారావు, మాబు, రామిరెడ్డి, హనుమంతరావు, ప్రసాద్, సుబ్బారావు, రాంబాబు, నాగేశ్వరరావు, రఫీ, రాయప్ప, బంగారం, ఆగస్టిన్, విశేశ్వరవు, సింధు, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.