- సోమందేపల్లి కేజీబీవీ హాస్టల్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు పరామర్శ
- వైసీపీ చిల్లర రాజకీయాలపై ఆగ్రహం
- హాస్టళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్
సోమందేపల్లి (చైతన్యరథం): ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన విద్యార్థులతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత హితవు పలికారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థినులు అస్వస్థతకు గురైన చేసుకున్న ఘటన బాధాకరమని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అస్వస్థతకు గురైన కేజీబీవీ హాస్టల్ విద్యార్థినులను మంత్రి సవిత పరామర్శించారు. హాస్టల్‌లోని తరగతి గదులను, విశ్రాంత గదులను, వంట గదిని, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. కేజీబీవీ స్కూల్లో ఏడుగులు విద్యార్థులు గురువారం జ్వరంతో బాధపడ్డారని, వారికి వైద్యులు, ఏఎన్‌ఎంలు వైద్య సేవలందించారని తెలిపారు. అనంతరం మరికొందరు కూడా అస్వస్థతకు గురయ్యారన్నారు. ఇటీవలే విద్యా సంవత్సరం ప్రారంభమైందని, దీనివల్ల కొందరు విద్యార్థులు ఇంటిపై బెంగతో భోజనం చేయడం లేదన్నారు. అదే సమయంలో ఐరన్ ఫోలిక్ మాత్రలను విద్యార్థినులకు అందజేశారన్నారు. ఈ మాత్రల వల్ల కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటన్నింటి వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని డీఎంహెచ్‌వో కూడా తెలిపారని వెల్లడిరచారు. హాస్టల్‌లో 232 మంది విద్యార్థినులు భోజనం చేయగా, కేవలం 17 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇప్పుడంతా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడిరచారు. తాగునీటి నమూనాలన పరీక్షల నిమిత్తం పంపించామన్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం బాధాకరమని, భవిష్యత్తులో మరోసారి ఇటువంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ఇదే విషయం హాస్టల్ సిబ్బందికి కూడా స్పష్టం చేశామన్నారు.
విద్యా వ్యవస్థను గాడిలో పడతున్నాం
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత పాలకులు గాలికొదిలేశారని, తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిందన్నారు. డైట్ బిల్లులు చెల్లించామని, హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పెనుకొండలో హాస్టళ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
పెనుకొండలో బీసీ హాస్టళ్లకు మరమ్మతులు చేయించామని, మరో బీసీ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశామని మంత్రి సవిత గుర్తు చేశారు. రూ.1.50 కోట్లతో గోరంట్లలో కేజీబీవీ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. పెనుకొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కనున్న ఎంజేపీ స్కూల్‌ను తన సొంత నిధులు రూ.50 లక్షలతో మరమ్మతులు చేయించానన్నారు. మరో నూతన ఎంజేపీ స్కూల్‌ను కూడా పెనుకొండకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లాలోని బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.3 కోట్లు వెచ్చించామన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్ల మరమ్మతుల కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశామన్నారు. పెనుకొండలో అన్ని సంక్షేమ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. తనతో సహా పలువురు ప్రజాప్రతినిధులు తరుచూ హాస్టళ్లను సందర్శిస్తున్నారన్నారు.
విద్యార్థులతో చిల్లర రాజకీయాలు మానుకోవాలి
వైసీపీ నాయకులకు శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని మంత్రి సవిత మండిపడ్డారు. సోమందేపల్లి కేజీబీవీ హాస్టల్‌లో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతోనూ చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు.
సీట్లు, టీటీడీ లెటర్లు అమ్ముకున్న చరిత్ర నీది
‘హాస్టళ్ల సీట్లు, తిరుమల లెటర్లు అమ్ముకున్న చరిత్ర నీది… ఈ విషయం కల్యాణదుర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు. మీ నాయకుడికి శవ రాజకీయాలు… నీకు చిల్లర రాజకీయాలు చేయడం అలవాటుగా మారిపోయిందని మాజీమంత్రి ఉషశ్రీ చరణ్‌పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్యాణదుర్గంలో ఎన్ని హాస్టళ్లు ఉన్నాయో నీకు తెలుసా… అయిదేళ్లలో ఏనాడయినా ఏ హాస్టల్ నైనా సందర్శించావా.. అని ప్రశ్నించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కల్యాణదుర్గం వచ్చిన సమయంలో ఓ దళిత బిడ్డను పొట్టన పెట్టుకున్న విషయం మరిచిపోయావా అని నిలదీశారు. ఆనాడు అంబులెన్స్‌కు దారి ఇచ్చి ఉంటే ఆ దళిత బిడ్డ బతికి ఉండేదన్నారు. ఇటీవల జగన్ రెడ్డి వాహనం కింద దళితుడు పడి ప్రాణాలు కోల్పోతే.. ఈడ్చి పక్కన పడేశారన్నారు.
హాస్టళ్ల అభివృద్ధిపై చర్చకు రావాలి
వైసీపీ నాయకులు మంచి సలహాలు సూచనలు ఇస్తే, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత తెలిపారు. అంతేగాని విద్యార్థుల పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సవిత అంటే ఏమిటో పెనుకొండతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హాస్టళ్ల అభివృద్ధికి అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఏమి చేశామో చర్చకు సిద్ధమా అని ఉషశ్రీ చరణ్ కు మంత్రి సవిత సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.