- సంక్షేమ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
- చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లల్లో మరమ్మతులు
- పరీక్షల్లో 100 ఉత్తీర్ణతే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలి
- టెన్త్, ఇంటర్ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో మంత్రి డోలా వీడియో కాన్ఫరెన్స్
ఒంగోలు (చైతన్యరథం): పేదరికాన్ని ఎదిరించి ఉన్నత విద్యావంతునిగా ఎదిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ ఉన్నత స్థితిలో నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేలా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో ఆదివారం ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహం నుంచి మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ విద్యతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమన్నారు. అందుకే విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్టళ్ళ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.143 కోట్లను మంజూరు చేసిందని, ప్రకాశం జిల్లాకు 13 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామన్నారు.
వీటితోపాటు ఒంగోలులోని సంతపేటలో రూ.6.50 కోట్లతో బాలికల హాస్టల్, సంతనూతలపాడులో రూ.2 కోట్లతో బాలుర హాస్టల్, చీమకుర్తిలో రూ.2 కోట్లతో బాలికల హాస్టల్, ఒంగోలులోని సక్కుబాయమ్మ ప్రభుత్వ కాలేజీలో రూ.5.50 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సక్కుబాయమ్మ కాలేజీ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అప్పటివరకు పరివర్తన భవనంలో వారికి ఆశ్రయం కల్పించడానికి 60 లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించి ఉత్తమ విద్య, నాణ్యమైన భోజనం పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని మంచి మార్కులతో అందరూ ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. అందుకే విద్యార్థుల్లో ధైర్యం నింపేలా నేరుగా తానే మాట్లాడుతున్నట్లు చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రతిభ చాటాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం అని మంత్రి తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు అవసరమైన ఆల్ – ఇన్ – వన్ గైడ్లు ఇచ్చామని, పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అవసరమైన చోట ట్యూటర్లను కూడా పెట్టామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బి.పి.టి.(సన్న) బియ్యంతో భోజనం పెడతామని, అన్ని హాస్టళ్లలో మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెడతామని, సకాలంలో ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, టవల్స్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వమే గార్డియన్ అని మంత్రి చెప్పారు. వారి రక్షణకు, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హాస్టళ్లలో పరిస్థితి మెరగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల మిస్సింగ్ కేసులను త్వరగా ఛేదించామన్నారు.
వెల్ఫేర్ ఆఫీసర్లు , వార్డెన్లు కూడా ప్రతి ఒక్క విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి ఆదేశించారు. లోగ్రేడులో ఉన్న విద్యార్థులు కూడా మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చూడాలని, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఉన్నందున ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమయ్యేలా చేయాలని సూచించారు. స్టడీ అవర్స్ పై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతిభగల విద్యార్థులతో గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేయించాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. సింగరాయకొండ గురుకుల కాలేజీలో డిగ్రీ కోర్సులు కూడా ప్రవేశపెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కేవలం చదువే కాకుండా విద్యార్థులకు అవసరమైన వినోదం కోసం రిక్రియేషన్ సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని వివిధ హాస్టళ్లలో జరుగుతున్న మరమ్మతు పనులను కూడా ఈ సందర్భంగా మంత్రి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఏ.పీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సీ. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ బాబుకు ఈ పనులకు సంబంధించి మంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
“`