అమరావతి (చైతన్య రథం): సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అన్ని వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి ఆర్‌టిజిఎస్ ద్వారా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాంఘిక, గిరిజన మరియు మైనారిటీ సంక్షేమ శాఖల పనితీరును సమీక్షిస్తూ.. రాష్ట్రంలో ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ అమలుకు ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఏకసభ్య కమిషన్‌గా నియమించిందన్నారు. కమిషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన నేటివ్, ఇన్కమ్, క్యాస్టు తదితర అన్ని రకాల సర్టిఫికేట్లను ఆన్ లైన్ ద్వారా తక్షణమే అందజేయాలని, ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే జి.ఓ.నెం.3 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కౌంటరు దాఖలు చేసే ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు. గిరిజన హక్కులకు ఎటువంటి విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మైనారిటీలకు రంజాన్ తోఫాను అందజేసే ఏర్పాట్లు చేయాలని, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.