- అధికారులకు జలవనరుల మంత్రి నిమ్మల ఆదేశం
- పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేందుకు అదనపు మిషనరీ, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్ట్‌ల సీఈలు, ఎస్‌ఈలు, ఈఈ లు, నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తిచేసేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు వేగంగా జరుగుతున్న పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.