(చైతన్యరథం): కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మహిళలు మరణించడం తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి నుంచి కడపకు వస్తున్న కారును గువ్వలచెరువు మాట్ రోడ్డు వద్ద వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు ధ్వంసమై అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
మంత్రి జనార్ధన్‌రెడ్డి విచారం
గువ్వలచెరువు ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లుభవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాలను.. డేంజర్ స్పాట్‌లుగా గుర్తించి చోదకులను అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మార్చురీకి మంత్రి మండిపల్లి
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదంలో నలుగురు చనిపోగా వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కడప రిమ్స్ కు వెళ్లి మార్చురీ గదిలోని మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎటువంటి అవసరమన్నా తమను సంప్రదించాలని, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.