- వైద్య,ఆరోగ్యశాఖ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
- ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపొందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి (చైతన్యరథం): ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందేలా, వైద్య, ఆరోగ్య శాఖపై నిరంతర పర్యవేక్షణకు, శాఖలో పరిపాలనా వ్యవహారాలను పటిష్టం చేసే లక్ష్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ 30 అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించారు. ఆయా అంశలపై నిర్దిష్ట కాలపరిమితుల మేరకు పనితీరు, ఫలితాలపై సమీక్షలు జరపాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబును మంత్రి ఆదేశించారు.
గతేడాది జూన్‌లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వివిధ సమీక్షా సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు, ఆలోచనలు… వైద్య సేవలు, మంత్రిత్వ శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన సమీక్షల్లో వెల్లడైన ఆంశాల ఆధారంగా ఈ ఎజెండాను రూపొందించారు
ఎజెండాలోని ప్రధానాంశాలు
1) ఆరోగ్యరంగానికి సంబంధించి స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ పత్రంలోని లక్ష్యాల్ని, మార్గాల్ని ప్రజలకు తెలియజేసి, లక్ష్య సాధనలో సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడం
2) వాట్సాప్ ద్వారా ప్రజలకందించే వైద్య సేవల్ని గుర్తించి తగు చర్యల్ని చేపట్టడం
3) ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు త్వరిత గతిన నిర్ణయాల్ని తీసుకునేందుకు అవసరమైన పాలనా వికేంద్రీకరణ
4) వైద్య సేవల్లో కృత్రిమ మేథ(ఏఐ) పూర్తి వినియోగ అవకాశాల్ని గుర్తించి ఆ మేరకు చర్యల్ని చేపట్టడం
5) డిజిటల్ వైద్య సేవల్ని విస్తృతం చేయడం
6) వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు
7) వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వ సాయాన్ని రాబట్టడం
8) వివిధ విభాగాధిపతులు, వైద్యులు, అధికారుల పనితీరును నిష్పక్షపాతంగా ఫలితాల ప్రాతిపదికన మదింపు చేయడం
9) వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం కోసం పటిష్ట చర్యలు, పర్యవేక్షణ
10) అవినీతిని అరికట్టడానికి పటిష్ట చర్యలు
11) పథకాల అమలు, పనితీరుపై విభాగాధిపతులు, వివిధ పథకాల నోడల్ అధికారులు నెలవారీ నివేదికల్ని అందించడం-వాటిని సమీక్షించడం
12) ప్రజల్లో సరైన శుభ్రత, ఆరోగ్యపు అలవాట్లను పెంచడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం
13) రాష్ట్రం, దేశ విదేశాల్లో ఆరోగ్య సేవల తీరును మదింపు చేసి సేవల నాణ్యత, తీరు పెంచడానికి మంత్రిత్వ శాఖకు సలహాలిచ్చేందుకు వైద్య, ఆరోగ్య రంగ నిష్ణాతులతో సలహా/సంప్రదింపుల కమిటీ ఏర్పాటు
14) ఆగస్టు నెలలో విడుదల చేసిన 30-సూత్రాల ప్రణాళిక మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రగతిని నిరంతరం సమీక్షించడం
15) అన్ని(175) అసెంబ్లీ నియోజక వర్గాల్లో స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు, హైబ్రిడ్ విధానంలో రూ.25 లక్షల బీమాను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా త్వరలో ప్రవేశపెట్టడం, పిపిపి విధానంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ దిశగా వేగవంతమైన చర్యల్ని చేపట్టడం
ఈ ఎజెండా అమలుపై వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నెలవారీ సమీక్షలు నిర్వహిస్తారు