- సీఎం సమక్షంలోనే భరోసానిచ్చిన మార్గదర్శిలు
- బంగారు కుటుంబం లబ్దిదారుల్లో ఆనందం
- పీ`4ను ఉద్యమంలా తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలకు ఎంపికైన వారి సమస్యలు విన్నారు. మార్గదర్శిలను ప్రోత్సహించి బంగారు కుటుంబం లబ్దిదారుల బాధ్యతలు వాళ్ల చేతుల్లో పెట్టారు. పేదరిక నిర్మూలనకు నడుంగట్టిన సీఎం చంద్రబాబు… పీ`4 కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. సోమవారంనాటి ప్రజావేదిక కార్యక్రమంలో `బంగారు కుటుంబానికి ఎంపికైన లబ్ధిదారు సరిగల నీలిమ మాట్లాడుతూ..
‘నా భర్త చనిపోవడంతో ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నాను. సొంతిల్లు లేదు, స్థలం లేదు. మా నాన్న విద్యుత్ పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. ఇద్దరు బిడ్డలున్నారు. నెలకు రూ.8 వేలకు కిరాణా షాపులో పని చేస్తున్నాను. పదవ తరగతి వరకు చదువుకున్నాను’ అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఔదార్యాన్ని చూపిస్తూ ‘సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించి నీలిమ కుమారుడు చెవిని బాగు చేయిస్తా’నని హామీ ఇచ్చారు. మరో లబ్దిదారు గొడవర్తి స్వప్న మాట్లాడుతూ ‘నాకు ఇద్దరు పిల్లలు. నాకు మా మామయ్య కట్టించిన ఇంట్లోనే నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. మాకు ఆస్తులు, పొలాలేమీ లేవు. నాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా భర్త సెంట్రింగ్ వర్క్ చేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటోంది. నా భర్తకు సెంట్రింగ్ సామాగ్రిని సమకూర్చాలని కోరుతున్నా’ అన్నారు.
ప్రజావేదిక సభలో మార్గదర్శి, పీఐ డేటా సెంటర్ అధినేత ముప్పనేని కళ్యాణ్ మాట్లాడుతూ ‘20 ఏళ్లు అమెరికాలో పని చేసి స్థిరపడ్డాను. భారతదేశానికి వచ్చి ఏదోకటి చేయాలనుకున్న సమయంలో చంద్రబాబును 2014 అక్టోబర్‌లో కలిశాను. డేటా సెంటర్ పెడతానని చెప్తే ప్రోత్సహించారు. ప్రపంచంలోనే మంచి డేటా సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసి వేలమందికి ఉద్యోగాలు ఇచ్చాం. మా కంపెనీలో ఉద్యోగాలు చేశాక మంచి కంపెనీలకు వెళ్లి పెద్ద జీతాలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో లక్షలమంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా పీ`4లో పాలుపంచుకోవాలి. స్వర్ణాంధ్ర విజన్`2047 సాధనకు పీ`4 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పీ`4 కేస్ స్టడీగా మిగులుతుంది. పొన్నెకల్లు గ్రామంలో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటాను. స్వప్నను మా సంస్థలోకి తీసుకుని నైపుణ్యం పెంచి క్లౌడ్ ఇంజినీర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను’ అని ప్రకటించారు. మరో మార్గదర్శి, శ్రీలతా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్ అధినేత సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ..
‘మీ స్ఫూర్తితో స్పిన్నింగ్ మిల్ పరిశ్రమను స్థాపించాం. మీ ప్రభుత్వంలో పరిశ్రమలకు సబ్సిడీలు రావడంతో అభివృద్ధి చేసుకున్నాం. ప్రస్తుతం ఐదు వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. టీటీడీ, ఇస్కాన్, పలు సేవా సంస్థలకు విరాళాలు అందిస్తున్నాం. సరిగల నీలిమకు ఉద్యోగమిస్తాం. ట్రైనింగ్ ఇచ్చి ఇల్లు, భోజనం వసతి కల్పించి మంచి జీతం ఇస్తాం. ఆమె ఇద్దరి పిల్లల చదవు బాధ్యతను తీసుకుని ప్రయోజకులయ్యే దాకా చూసుకుంటాం. పొన్నెకల్లులో 50 పేద కుటుంబాలను పైకి తీసుకొచ్చేలా చొరవ తీసుకుంటా’మని ప్రకటించారు. కెకె స్పింటెక్స్ అధినేత ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు స్ఫూర్తి చూస్తే మాలాంటి వారికి ఆనందంగా ఉంది. సీఎం పిలుపునిచ్చిన పీ`4 కార్యక్రమంలో భాగంగా నైపుణ్యంపెంచి 10 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా’మని ప్రకటించారు. మరో మార్గదర్శి, సుదర్శిని ఐ హాస్పిటల్ అధినేత రాజేష్ మాట్లాడుతూ.. ‘పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్గదర్శులు ఇచ్చిన చేయూతను అందిపుచ్చుకుని పైకి రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేందుకు మేం ముందుకు వస్తాం. మా డాక్టర్స్ అందరం గుంటూరు బ్రాంచ్ తరపున 50 కుటుంబాలను దత్తత తీసుకుంటాం’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన మార్గదర్శిలను సీఎం చంద్రబాబు సన్మానించారు.