- వచ్చే ఏడాదికి బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి
- రవాణా వ్యయం తగ్గించేలా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు
- ఏపీలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి లక్ష్యం
- ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం
- రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా. కార్యాచరణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు, ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం, తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను ఈ జాతీయ రహదారులతో అనుసంధానించాలని ఆదేశించారు. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చేసేలా హింటర్ ల్యాండ్‌ను కనెక్టు చేసేలా రోడ్లు నిర్మించాలని స్పష్టం చేశారు.
ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో దేశంలోనే ఏపీ బెంచ్ మార్క్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా, 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రూ.42,194 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగుళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027 కల్లా పూర్తి కావాలని సూచించారు. ఖరగూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌వే కి కూడా త్వరలోనే డీపీఆర్ లు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే ప్రజలకు తక్షణం ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన వివిధ రోడ్డు ప్రాజెక్టులకు కూడా అనుమతులు తీసుకుని వేగంగా పనులు చేపట్టాలని సూచించారు. కేంద్రానికి ఇవ్వాల్సిన ప్రతిపాదనల్ని కూడా తక్షణమే సమర్పించాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం, రాయపూర్-అమరావతి, మూలపేట పోర్టు-జగదల్ పూర్, రాయపూర్‌లను కూడా అనుసంధానించేలా రహదారుల నిర్మాణం జరగాలని సీఎం నిర్దేశించారు.
రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రహదారి నెట్వర్క్ు్స్ను మరింత విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రహదారులు భవనాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. 5. 2500 5 6,054 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రహదారుల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, తిరుపతి ఐఐటీ రూపొందించిన నానో కాంక్రీట్ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మకంగా రోడ్లను వేస్తున్నామని తెలిపారు. 45 వేల కిలోమీటర్ల రాష్ట్ర, జిల్లా రహదారుల్లో ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. రామ్స్ టెక్నాలజీ ద్వారా రోడ్ల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీపీపీ కింద 709 కిలోమీటర్ల మేర 12 రహదారులను కూడా చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పటిష్టంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షకు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు.














