- రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికీ కెపాసిటీ బిల్డింగ్‌పై శిక్షణ
- ముఖ్యమంత్రి చైర్మన్‌గా త్వరలో పీ4 ఫౌండేషన్
- పాపులేషన్ మేనేజ్మెంట్‌పై త్వరలో ప్రత్యేక పాలసీ
- ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- ఆపరేషన్ సిందూర్‌పై సమావేశంలో చర్చ… భారత సైన్యం చర్యకు అభినందనలు
- ప్రధాని మోదీ విదేశాంగ విధానం అద్భుతం అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్‌పై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగినుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికీ కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… వ్యవసాయ శాఖ అధికారి నుంచి సెక్రటరీ వరకు… కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కెపాసిటీ బిల్డింగ్ జరగాలన్నారు. ‘నేను కూడా నిత్యం కెపాసిటీ బిల్డింగ్‌పై దృష్టిపెడతా. కొత్త విషయాలు నేర్చుకుంటా. టెక్నాలజీ గురించి తెలుసుకుంటా. సాంకేతికత ద్వారా పాలనలో ఎటువంటి మార్పులు తేవచ్చనేది తెలుసుకుంటా. ప్రతి ఉద్యోగి శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యాలను పొందవచ్చు. ఇది పాలనలో ఫలితాలకు ఎంతో ఉపయోపడుతుంది. సేవల్లో నాణ్యత పెరుగుతుంది’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
వచ్చే నెలకల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్
స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం కాగా… నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ వచ్చే నెలనాటికి రూపొందించనున్నారు. అలాగే థీమాటిక్ రిపోర్ట్స్ జూన్‌కు, సెక్టోరల్ రోడ్ మ్యాప్ సెప్టెంబర్ నాటికి రూపొందుతాయని అధికారులు వివరించారు. కీలక పాలసీలైన జీరో పావర్టీ పీ4, పాపులేషన్ మేనేజ్మెంట్ అంశాలను విజన్‌లో పొందుపరుస్తారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపులు మే 9తో పూర్తికానున్నాయి. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు నెలకొల్పేందుకు 143 నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 15,315 బంగారు కుటుంబాలను 1,118 మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా 25మందితో కూడిన జనరల్ బాడీ… దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంపవర్డ్ టీమ్స్‌తో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
జనాభా సమతుల్యత లక్ష్యం
మరోవైపు జనాభా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురానుంది. జనాభా సమతుల్యత అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువస్తోంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకు ఇచ్చే ప్రసూతి సెలవుల పరిమితిని ఎత్తివేసింది. అలాగే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా మినహాయింపు ఇచ్చింది. జనాభా పెరుగుదలకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించి… వాటి ఆధారంగా పాలసీ తీసుకురానుంది.
‘ఆపరేషన్ సిందూర్’కు అభినందనలు
సమీక్షా సమావేశంలో ముందుగా ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జరిగింది. ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడిని సమావేశంలో ముఖ్యమంత్రి ప్రశంసించారు. పహల్గాం దాడికి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం గట్టి సమాధానం ఇచ్చిందని సీఎం అన్నారు. భారత్ చర్యకు నేడు ప్రపంచ దేశాలు కూడా మద్దతుగా ఉన్నాయన్నారు. మోదీ విదేశాంగ విధానం కారణంగానే ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోందని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ అమలు చేసిన విధానం అద్భుతంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి, భద్రతా దళాల చర్యలకు మద్దతుగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.